భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంట దాయాదికి చెందిన ఓ డ్రోన్‌ను కూల్చేసింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్). కథువా జిల్లా పన్సార్ ఔట్ పోస్ట్ పైనుంచి ఎగురుతూ వెళ్తున్న పాక్ డ్రోన్‌ను గమనించిన సిబ్బంది ఉదయం 5.10 గంటలకు నేలకూల్చారు.
డ్రోన్‌ను పరిశీలించిన అనంతరం ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ఓ అధునాతన తుపాకీ, 60 రౌండ్ల తూటాలు, 7 గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. పన్సార్ వద్ద సరిహద్దుకు అవతలి వైపు నుంచి భారత్‌లో ఉన్న పాక్ ఏజెంట్లకు అందించేందుకే డ్రోన్ ద్వారా ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు భావిస్తున్నామని వెల్లడించారు బీఎస్ఎఫ్ అధికారులు.
ఈ అనుమానాస్పద పాక్ డ్రోన్ 250 మీటర్ల మేర భారత్‌లోకి చొచ్చుకొచ్చిందని.. తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం నేలకూలిందని చెప్పింది సైన్యం. ఘటనా స్థలానికి వెళ్లిన సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.