భారత్‌లోకి భారీగా ఆయుధాలతో చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రమూకలను పరుగులు పెట్టించాయి భద్రతా దళాలు. పాక్ రేంజర్ల సాయంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలోకి ప్రవేశించేందుకు యత్నించగా సరిహద్దు భద్రత దళం(బీఎస్ఎఫ్) ఉగ్రవాదులను నిలువరించినట్లు అధికారులు తెలిపారు.
" బలగాల దీటైన సమాధానంతో ఐదుగురు ముష్కరులు వెనక్కి తిరిగి పారిపోయారు. గత పదిహేను రోజుల్లో సాంబా జిల్లాలోని సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నించటం ఇది రెండోసారి. శనివారం రాత్రి ఉగ్రవాదుల బృందం సరిహద్దులు దాటేందుకు యత్నిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. వారిని అడ్డుకునే ప్రయత్నంలో ముష్కరులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఘగ్వాల్ ప్రాంతంలోని మంగు చాక్ సరిహద్దు ఔట్‌పోస్ట్(బీఓపీ) వద్ద రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జరిగింది. ఇదే సమయంలో పాకిస్థాన్ రేంజర్లు కూడా కాల్పులకు దిగారు. ఇరువురి మధ్య 30 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. బీఎస్ఎఫ్ దళాల దీటైన సమాధానంతో ముష్కరులు వెనక్కి పారిపోయారు."
- బీఎస్ఎఫ్ ప్రతినిధి.