జమ్ములోని భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో ఓ సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్) గుర్తించాయి. ఆ సొరంగ మార్గంలో ఇసుక సంచులను భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిపై పాకిస్థాన్‌కు చెందిన గుర్తులు కనిపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
దీంతో ఈ తరహా సొరంగ మార్గాలు ఇంకా ఉన్నాయేమో కనుగొనేందుకు ఆపరేషన్ చేపట్టాయి దళాలు. సొరంగం గుర్తించిన నేపథ్యంలో సరిహద్దుల్లో చొరబాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని సరిహద్దు కమాండర్లను బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్థానా ఆదేశించారు.
పంజాబ్‌లో ఇటీవల ఐదుగురు సాయుధులైన చొరబాటుదారులు హతమైన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలు మెగా డ్రైవ్‌ను చేపట్టాయి. ఇందులో భాగంగా జమ్ములోని సాంబా సెక్టార్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తుండగా ఈ సొరంగ మార్గాన్ని గుర్తించాయి.