బ్రిటిష్ ప్రసారకుడు డేవిడ్ ఎటెన్బరోకు 2019 సంవత్సరానికిగానూ ఇందిరాగాంధీ శాంతి బహుమతిని సోమవారం ప్రదానం చేశారు. దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆయనకు ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణలో డేవిడ్ 50 ఏళ్ల నుంచి అందిస్తున్న సేవల్ని కొనియాడారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రకృతి గురించి మానవాళికి తెలియజెప్పడానికి అద్భుతమైన చిత్రాలు, పుస్తకాల ద్వారా ఆయన విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
పచ్చదనంపై, వన్య ప్రాణులపై ప్రభావాన్ని చూపే ప్రాజెక్టుల విషయంలో యూపీఏ సర్కారు అత్యంత ఆచితూచి వ్యవహరించేదని, మరీ కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ తమపై విమర్శలు వచ్చేవని మన్మోహన్సింగ్ చెప్పారు. పర్యావరణానికి అన్ని రకాలుగా హాని జరుగుతున్న ప్రస్తుత తరుణంలో శాంతి పురస్కారం పొందడానికి డేవిడ్‌ను మించిన వ్యక్తి లేరని కొనియాడారు.