గణేశుడికి ఆ తల ఎలా వచ్చింది? అది ఎక్కడ ఉంది? భక్తులకు బుద్ధి, సిద్ధిని ప్రసాదించే దేవుడు వినాయకుడు. ఏ వేడుకైనా, శుభకార్యమైనా తొలి పూజలు గణనాథుడికే. అందరు దేవుళ్లకు భిన్నంగా వినాయకుడు ఏనుగు తలతో ఉంటాడు. గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? అసలు తల ఎక్కడుంది? ఓ సారి పరిశీలిస్తే..
ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లా, గంగోలిహట్లో.. మహాశివుడు ఆగ్రహంతో ఖండించిన వినాయకుడి అసలు శిరస్సు ఉంది. అక్కడి పాతాళ భువనేశ్వర గుహలో ఉన్నట్లు చెబుతారు. శిలారూపంలో ఉన్న విఘ్నేశ్వరుడి తలపై బ్రహ్మకమలం నుంచి తేనె పడుతూ ఉంటుందని స్థల పురాణం. అయితే వీటికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ.. ఈ గుహలో ఈశ్వరతత్వం ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. పార్వతీదేవిని చూసేందుకు అడ్డుకున్నాడన్న ఆగ్రహంతో మహా శివుడు ఖండించిన వినాయకుడి తల పాతాళ భువనేశ్వర గుహలో పడినట్లు స్థల పురాణం చెబుతోంది.
ఒకేసారి 4 పుణ్యక్షేత్రాల దర్శనం
నాలుగు పుణ్యక్షేత్రాలు చూడగలిగే అవకాశం కల్పించే ఏకైక ప్రాంతంగా పాతాళ భువనేశ్వర గుహ పేరొందింది. కేదార్నాథ్, బదరీనాథ్, అమర్నాథ్ క్షేత్రాలు ఈ గుహ నుంచి చూడవచ్చు. స్కంధ పురాణంలో పాతాళ భువనేశ్వర గుహ గురించిన ప్రస్తావన ఉంది. జగద్గురు శంకరాచార్య క్రీ.శ. 722లో ఈ గుహను సందర్శించారు. ఆ సమయంలో ధగధగా మెరిసి పోతున్న శివలింగాన్ని సామాన్యులు చూడలేరన్న కారణంతో లింగాన్ని రాగితో కప్పేశారు.
'విశ్వం పుట్టిందిక్కడే'
ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచే విశ్వం ఆది, అంతాలు చూడవచ్చని ఆలయ కమిటీ ఛైర్మన్ నీలం భండారీ తెలిపారు. విశ్వం పుట్టుక ఇక్కడే జరిగిందని, కలియుగం ఎప్పుడు ముగుస్తుందో ఈ గుహ లోపల తెలిసినప్పుడు.. ఈ సృష్టి ఇక్కడే మొదలైందన్న విషయం అవగతమవుతుందని ఆయన వివరించారు.
మొఘలుల కాలంనాటి రచనల్లో..
ఇదొక పురాతన పుణ్యక్షేత్రమని, గంగోలీహట్లో నెలకొన్న ఈ క్షేత్రం వివరాలు.. పురాణాల్లో, మొఘలుల కాలం నాటి రచనల్లో కనిపిస్తాయని యోగాంబర్ భడావాల్ అనే చరిత్ర కారుడు చెబుతున్నారు. లేడి వేటలో ఇక్కడకు వచ్చిన రాజా రీతుపర్ణకు శివ లింగం కనిపించిందని ఆయన అన్నారు. తర్వాత శంకరాచార్యుడు శివలింగాన్ని స్థాపించినట్లు కూడా నమ్మే ఈ దర్శనీయ, రమణీయ క్షేత్రంలో.. ఆశ్చర్యం కలిగించే అంశాలున్నాయని ఆ చరిత్రకారుడు పేర్కొన్నారు.
నాలుగు యుగాలను ప్రతిబింబిస్తూ..
నాలుగు యుగాలను ప్రతిబింబించే 4 శిలలు పాతాళ భువనేశ్వరగుహలో నెలకొని ఉన్నాయి. గుహలోపలికి ప్రవేశించగానే.. నరసింహ స్వామి దర్శనమిస్తాడు. కాస్త లోపలికి వెళ్తే.. శేష నాగుడి పడగ కనిపిస్తుంది. ఈ పడగపైనే భూమి నిలుస్తుందని నమ్ముతారు. మరింత ముందుకు వెళ్తే.. పరమ శివుడి జటాజూటం నుంచి గంగ ప్రవహిస్తున్నట్లు, కాలభైరవుడి నాలుక నుంచి లాలాజలం జాలువారినట్లుండే దృశ్యం కనిపిస్తుంది. ఐరావతం కూడా పాతాళ భువనేశ్వర గుహలో కనిపిస్తుంది. ఈ మార్గం గుండా వెళ్తే స్వర్గానికి చేరతారని నమ్ముతారు. 33 కోట్ల దేవతలు ఈ గుహలో నివాసముంటారని విశ్వాసం. ఇవన్నీ కళ్లారా చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
ఇదీ చదవండి:ఉత్తరం రాస్తే కష్టాలు దూరం చేసే త్రినేత్ర గణేశుడు!