బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో పరస్పర సహకారానికి యంత్రాంగాలను కూడా రూపొందించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు.
నవంబర్ 13, 14 తేదీల్లో జరిగే 11వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి బ్రెజిల్ బయలుదేరే ముందు ఓ ప్రకటన ద్వారా ఈ విషయం వెల్లడించారు మోదీ.
"'వినూత్న భవిష్యత్ కోసం ఆర్థిక వృద్ధి' అంశంపై బ్రిక్స్ సదస్సు జరుగుతుంది. ఈ అంశంపై బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా.. వారితో నా అభిప్రాయాలు పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను."
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
బ్రెజిల్తో ద్వైపాక్షిక భాగస్వామ్యం
బ్రెజిల్ - భారత్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతో సమావేశం కానున్నట్లు మోదీ తెలిపారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు కృషి చేస్తామని చెప్పారు.