తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను జయించిన నర్సు.. మళ్లీ సేవలందించేందుకు సిద్ధం

కరోనా బారినపడి కోలుకున్న ఓ నర్సు తిరిగి ఐసోలేషన్​ వార్డులో పని చేసేందుకు సిద్ధమంటూ తన వృత్తి నిబద్ధతను చాటుకుంది. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్న ఆమె త్వరలోనే విధుల్లో చేరతానంటూ సందేశం అందించి.. వైరస్​ను లెక్కచేయక సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తోంది.

Kerala nurse
కరోనాను జయించిన నర్సు

By

Published : Apr 5, 2020, 4:39 PM IST

కరోనా రోగులకు సేవలందించిన కేరళాకు చెందిన ఓ నర్సు ఆ వైరస్ బారినే పడింది. ఏ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించిందో అదే ఆస్పత్రిలో రోగిగా చేరాల్సి వచ్చింది. ఎంతో ధైర్యంతో ఆ మహమ్మారిపై విజయం సాధించింది. వైద్యం తీసుకున్న కొద్ది రోజులకే పరీక్షల్లో నెగిటివ్​గా తేలింది. ప్రస్తుతం క్వారంటైన్​లో​ ఉన్న తాను... కరోనా ఐసోలేషన్​ వార్డులో తిరిగి సేవలందించేందుకు సిద్ధమంటూ వృత్తిపై ఉన్న మమకారాన్ని, తనలోని ధైర్యాన్ని చాటిచెప్పింది. ఐసోలేషన్​లో సేవలందిస్తానంటూ తోటి సిబ్బందిలో ధైర్యం నింపింది.

కేరళ కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రిలో నర్సుగా సేవలందిస్తోంది రేష్మా మోహందాస్. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన వృద్ధ దంపతులు థామస్​ అబ్రహం (93), మరియమ్మ (88) ఉన్న ఐసోలేషన్​ వార్డులో విధులు నిర్వర్తించింది. వారికి అన్ని విధాల సేవలందించింది. వృద్ధులు అసౌకర్యంగా భావించి మాస్కులు ధరించకపోయినప్పటికీ.. వారికి వైద్యం చేసింది. ఇదే క్రమంలో వైరస్​ బారిన పడింది.

23న లక్షణాల గుర్తింపు..

మార్చి 23న తొలిసారి రేష్మాలో కరోనా లక్షణాలు కనిపించాయి. గొంతు నొప్పి రావటం వల్ల తోటి సిబ్బందిని అప్రమత్తం చేసింది. మార్చి 24న పాజిటివ్​గా తేలింది. ఇన్ని రోజులు వృద్ధ దంపతులకు ఎక్కడైతే సేవలు అందించిందో అక్కడే వైద్యం తీసుకోవాల్సి వచ్చింది. కొద్దిరోజులకే కరోనాను జయించింది. పరీక్షల్లో నెగిటివ్​గా వచ్చింది. ఈనెల 3వ తేదీన 14 రోజుల హోమ్​ క్వారంటైన్​ కోసం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లింది రేష్మా. ఈ సందర్భంగా తిరిగి సేవలందించేందుకు తాను సిద్ధమంటూ తన సందేశాన్ని అందించింది.

" ఒక వారం రోజుల్లో నిన్ను (కరోనాను) జయించి ఈ గది నుంచి బయటకి వెళతాను. కేరళ ఆరోగ్య వ్యవస్థపై పూర్తి నమ్మకంతోనే ఈ సందేశాన్ని వాట్సాప్​ గ్రూప్​లో పోస్ట్​ చేశాను. ఇక్కడ ప్రపంచ స్థాయి సేవలు ఉన్నాయి. నేను తిరిగి వచ్చాక ఐసోలేషన్​ వార్డులో పనిచేసేందుకు సిద్ధం " అంటూ తన సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది రేష్మా.

కరోనాను జయించిన దంపతులు

సాధారణంగా కరోనా బారిన పడిన వృద్ధులు ఆ వ్యాధి నుంచి బయటపడటం చాలా అరుదు. రేష్మా సేవలు అందించిన వృద్ధ దంపతులు ఇద్దరూ ఆ మహమ్మారిని జయించారు. వారు కరోనా నుంచి కోలుకున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేసింది నర్సు.

ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంస..

కరోనా నుంచి కోలుకున్న నర్సు రేష్మాకు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ఫోన్​ చేసి సంతోషం వ్యక్తం చేశారు. రేష్మా వృత్తి నిబద్ధతను కొనియాడారు. వృద్ధ దంపతులకు సొంత తల్లిదండ్రుల్లా సేవలందించిందని ప్రశంసించారు.

ఇదీ చూడండి: చేతులు పదేపదే కడిగినా ఇబ్బందే- ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details