సినిమాల్లో కథానాయకులు తమ ప్రేమలో గెలిచేందుకు, ప్రియురాల్ని దక్కించుకునేందుకు కష్టాలు పడుతుంటారు. ఫైట్లూ, ఫీట్లు చేస్తుంటారు. సంప్రదాయాలను ఎదిరిస్తుంటారు. ప్రేమ కోసం వారు పడే కష్టాలను గొప్పగా చూపిస్తుంటారు. ఆ రీల్ లైఫ్ కథల నుంచే స్ఫూర్తి పొందాడేమో ముంబయికి చెందిన ఈ ప్రేమికుడు. లాక్డౌన్ కారణంగా రవాణా నిలిచిపోయిన వేళ పెద్ద సాహసమే చేశాడు. సొంత ఊళ్లో చిక్కుకుపోయిన ప్రేయసి కోసం పోలీసుల కంటపడకుండా కాలినడకన 500 కిలోమీటర్లు నడిచాడు.
ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు.. ముంబయిలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న సింధుదుర్గ్‌కు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి ముంబయిలో సహజీవనం(డేటింగ్) సాగిస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తండ్రి అనారోగ్యం కారణంగా లాక్‌డౌన్‌కు ముందు ఇంటికి వెళ్లింది యువతి. ఇంతలోనే ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ కారణంగా.. చాలాకాలం పాటు కలుసుకోలేకపోయిందా జంట.
'నిన్నూ విడిచి.. ఉండలేక'
ప్రేయసి సొంత ఊళ్లో ఉండటం వల్ల.. ముంబయిలో ఒక్కడే ఉండలేకపోయాడు ఆ ప్రియుడు. గ్రామంలో ఉన్న ప్రేయసిని చేరుకునేందుకు ఏదైనా చేసేందుకు సిద్ధమయ్యాడు. పోలీసుల కన్నుగప్పి ఎట్టకేలకు ప్రియురాలి గ్రామానికి చేరుకున్నాడీ విరహప్రేమికుడు. తన ప్రేయసిని కలిసి మురిసిపోయాడు.