ప్రజలకు ఒకప్పుడు మంచి నీటి అవసరాలు తీర్చిన చెరువుల పరిస్థితి దారుణంగా తయారైంది. సరైన నిర్వహణ లేక చాలా ప్రాంతాల్లోని చెరువులు.. నాచు, మురుగు నీరు, ప్లాస్టిక్ వస్తువులతో కలుషితమై కనిపిస్తున్నాయి. వాటిని శుభ్రం చేసేందుకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా లాభం లేకుండా పోతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తనూ భాగమవ్వాలనే ఉద్దేశంతో సరికొత్త ఆవిష్కరణ చేశాడు కర్ణాటక సురపుర్ నగరానికి చెందిన ఓ విద్యార్థి. చెరువు నీటిని శుభ్రపరిచే సరికొత్త సైకిల్‌ను రూపొందించాడు.
సురపుర్కు చెందిన సాహిల్ గిరీష్ కులకర్ణి అనే 10వ తరగతి విద్యార్థి.. ఇప్పటికే పలు శాస్త్రీయ ఆవిష్కరణలతో ఔరా అనిపించాడు. రూ.20కే వెల్డింగ్ చేసే పరికరాన్ని తయారు చేశాడు. ఎల్ఈడీ బల్బులను రిపేర్ చేయటం, ఇంటి మ్యాప్ వంటి పలు ప్రయోగాలతో అందరి మన్ననలు పొందాడు.