బంగాల్ బీర్భమ్ జిల్లాలోని విశ్వభారతి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. 'పౌష్ మేళా' ఉత్సవం నిర్వహించే మైదానంలో సరిహద్దు గోడ నిర్మాణానికి వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు.
శాంతినికేతన్ క్యాంపస్ వద్ద 4 వేల మందికిపైగా ప్రజలు గుమిగూడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి యూనివర్సిటీ గేటును పడగొట్టినట్లు వెల్లడించాయి. పలు ఆస్తులను ధ్వంసం చేశారని తెలిపాయి. ఘటనా స్థలంలో దుబ్రాజ్పుర్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేశ్ బౌరీ సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
యూనివర్సిటీ నిర్ణయమే!
పౌష్ మేళా వార్షిక శీతాకాల ఉత్సవం జరిగే మైదానం చుట్టూ గోడ నిర్మించాలని విశ్వవిద్యాలయ అధికారులే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు జాతీయ హరిత ట్రైబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నారు. గోడ నిర్మాణ పనులు ఈ ఉదయం ప్రారంభమైనట్లు సమాచారం.
తాజా ఆందోళనలపై స్పందించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు నిరాకరించారు.