తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనకు చైనా దుందుడుకు చర్యలే కారణమని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ స్పష్టం చేసింది.
సరిహద్దు ఉద్రిక్తతలకు కారణం భారత్ తీరేనని ఇటీవల చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ.
ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను తాము గౌరవిస్తున్నట్లు చైనా మాటల్లో చెప్పడం కాదని చేతల్లో చూపించాలని ఆయన అన్నారు. భారత్-చైనా మధ్య దౌత్యచర్చలు మొదలై 70 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఇరుదేశాలు సంయుక్తంగా స్మారక స్టాంప్ విడుదల చేయాలని గతంలో అనుకున్నాయి. అయితే ఈ కార్యక్రమం రద్దు అవ్వడానికి కారణం భారత్ అని ఇటీవల చైనా ఆరోపించింది. ఈ ఆరోపణలను శ్రీవాస్తవ తప్పుబట్టారు.
"మేము గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే స్పష్టంగా ఉన్నాం. ఈ విషయంలో వారి దగ్గర నుంచి ఇటీవల ఎలాంటి స్పందన లేదు. ఆరు నెలలుగా సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగడానికి కారణం వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని చైనా ఏకపక్షంగా మార్చడానికి ప్రయత్నించడమే. ఈ చర్యలు ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు విరుద్ధం. ఎల్ఏసీ వద్ద శాంతి స్థాపనకు ఈ ఒప్పందాలు కీలకం.