భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో మత్స్య పరిశ్రమది కీలక పాత్ర. ప్రతి దశాబ్దానికీ ఈ పరిశ్రమ చెప్పుకోదగిన ప్రగతి చూపుతోంది. ప్రస్తుతం చేపల ఎగుమతుల్లో చైనాది ప్రథమ స్థానం. 2016-17లో రూ.37,870 కోట్లు, 2018-19లో రూ.45,000 కోట్ల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసి భారత్ రెండో స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో చేపల ఎగుమతుల పురోగతికి కావలసిన వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. పరిశ్రమకున్న ఈ సామర్థ్యాన్ని గ్రహించి కేంద్ర ప్రభుత్వం నీలి విప్లవం పునరుత్తేజానికి సమాయత్తమైంది. దీన్ని నీలి విప్లవం 2.0 గా వ్యవహరించవచ్చు.
రెండో నీలి విప్లవం సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.25 వేలకోట్లు మత్స్యపరిశ్రమకు కేటాయించింది. మూడు నుంచి అయిదేళ్లలో పరిశ్రమలోని వివిధ విభాగాల్లో ఈ పెట్టుబడులను వినియోగిస్తారు. నౌకాశ్రయాల్లో మౌలికవసతుల కల్పనకు, హేచరీలు, ఇతర ఆధునిక సదుపాయాల కల్పనకు, మత్స్య ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, శీతలీకరణ గొలుసు (కోల్డ్ చైన్) సదుపాయాలకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు కేంద్ర మత్స్య శాఖ కార్యదర్శి రజని సిఖ్రి సిబల్ వెల్లడించారు.
మౌలిక వసతులకు ప్రాధాన్యం
భారత్ లో ఏడో పంచవర్ష ప్రణాళిక కాలం (1985-90)లో కేంద్ర ప్రభుత్వం మొదటిసారి నీలి విప్లవాన్ని సాధించింది. చేపలు, ఇతర సముద్ర ఆహారోత్పత్తుల వినియోగం పెంచేందుకు ఎన్నో కొత్త విధానాలను అనుసరించింది. చేపల బ్రీడింగ్ మొదలుకుని మార్కెటింగ్ తదితర అంశాల్లో రైతులు వినూత్న పద్ధతులు పాటించేలా కృషి చేసింది. ఎగుమతులనూ ప్రోత్సహించింది. దాంతో మొదటి నీలి విప్లవం సాకారమైంది.
తాజాగా కేంద్రం నీలి విప్లవం ఛత్రం కింద పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టింది. పరిశ్రమ పురోగతికి 2015-16 నుంచి ఇప్పటివరకు రూ.1,491 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ కమిటీ మత్స్య పరిశ్రమకోసం మత్స్య, రొయ్యల మౌలిక వసతుల అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా మత్స్య పరిశ్రమకు అవసరమైన మౌలిక వసతులు సమకూరుతాయి. 2020నాటికి ఆక్వా ఉత్పత్తులను 1.50 కోట్ల టన్నులకు, 2022-23నాటికి రెండు కోట్ల టన్నులకు పెంచడం ధ్యేయం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ నిధులు వినియోగిస్తారు. 2030నాటికి దేశ ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను రూ,4,50,000 కోట్ల స్థాయికి పెంచాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇది ఇప్పటి ఎగుమతులకంటే పది రెట్లు ఎక్కువ.
మత్స్య పరిశ్రమ దేశవ్యాప్తంగా 1.40 కోట్ల మందికి జీవనోపాధి కల్పిస్తోంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో మత్స్య పరిశ్రమ వాటా ఒక శాతం. 50 రకాలకు పైగా చేపలు, రొయ్యలు, పీతలు తదితరాలను భారత్ 75 దేశాలకు ఎగుమతి చేస్తోంది. చేపలు, చేపల ఉత్పత్తులు ఎగుమతుల్లో చెప్పుకోదగిన పరిమాణాన్ని సంతరించుకున్నాయి. ఏటా విదేశాలకు జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం, వ్యవసాయ-అనుబంధ శాఖల ఎగుమతుల్లో 20 శాతం వాటా కలిగి ఉన్నాయి. రొయ్యలు, రొయ్యపిల్లల ఎగుమతిలో ప్రపంచంలో భారత్‌దే అగ్రస్థానం. దేశవ్యాప్తంగా 8,129 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. జాలర్లు, ఆక్వా రైతులు 3,827 గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. చేపలను విక్రయించే 1,914 సంప్రదాయ కేంద్రాలు (విపణులు) ఉన్నాయి. ఈ రంగం భారత్ లో కొంత శాతం జనాభాకు ఆహార భద్రత కల్పిస్తూ వేగంగా పురోగమిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో భారత్ వాటా 6.3 శాతం. ఎగుమతుల్లో వృద్ధి రేటు ఏడు శాతం. సీబాస్, గ్రే ముల్లెట్, కాట్ల, రోహు తదితర రకాల చేపలు, ఆర్నమెంటల్ చేపలు, పీతలు, రొయ్యలు, ముత్యాలు (పెరల్ కల్చర్ ) ఇక్కడ ఉత్పత్తవుతున్నాయి. మంచినీటి చేపల సాగులో కట్ల, రోహు, మ్రిగల్ రకాలు ఉత్పత్తిలో 87 శాతం వాటాను ఆక్రమించాయి. భారత్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2017-18లో అమెరికాకు 32.76 శాతం, ఆగ్నేయాసియాకు 21.59 శాతం చొప్పున జరిగాయి. ఐరోపాకు 15.77 శాతం, జపాన్ కు 6.29 శాతం, మధ్యప్రాచ్యానికి 4.10 శాతం, చైనాకు 3.21 శాతం ఎగుమతయ్యాయి. బ్లాక్ టైగర్, వనామీ రొయ్య రకాలు అభివృద్ధి చెందిన దేశాలకు ఎగుమతి కావడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు 308 కోట్ల డాలర్లు (రూ.22 వేలకోట్లకు పైగా) సమకూరాయి. తక్కువ లోతున్న 39 లక్షల హెక్టార్ల సముద్రంలో 12 లక్షల హెక్టార్లు చేపల ఉత్పత్తికి అనుకూలం. ఇది కాకుండా, 20 లక్షలకు పైగా చ.కి.మీ.లలో ఎక్స్ క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజడ్) ఉంది. కేంద్రం ఫిష్ ఫార్మర్స్ డెవలప్ మెంట్ ఏజెన్సీస్ (ఎఫ్ ఎఫ్ డీఏ) కు, 39 బ్రాకిష్ వాటర్ (ఉప్పునీటి) ఫిష్ ఫార్మర్స్ డెవలప్ మెంట్ ఏజెన్సీస్; (బీఎఫ్ డీఏ)కి మద్దతిచ్చే వ్యవస్థను నెలకొల్పింది.