'మిషన్ 200'.. 294 స్థానాలున్న బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా నినాదం. అధికారం చేజిక్కించుకోవటమే కాదు.. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమలదళం. అధికార టీఎంసీని చిత్తు చేసేందుకు అన్ని అవకాశాలను లెక్కేసుకుంటోంది. మిషన్-200ను విజయవంతం చేసేందుకుగానూ ఫార్ములా-23ని తీసుకొచ్చింది.
బిహార్ ఫలితాన్ని బంగాల్లోనూ పునరావృతం చేయాలని భావిస్తోంది భాజపా. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున అమిత్ షా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మమతా బెనర్జీ ఓటమే ప్రధాన అజెండాగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఏంటీ 'ఫార్ములా-23' ?
2014 సార్వత్రిక ఎన్నికల నుంచి భాజపా తమ రాజకీయ విధానాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఎన్నికల అంశంలో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి సారించిన భాజపా చాణక్యుడు అమిత్ షా.. దేశవ్యాప్తంగా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయటంపై శ్రద్ధ పెట్టారు. 'మేరా బూత్.. సబ్సే మజ్బూత్' నినాదం తీసుకొచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి.. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్నారు. బంగాల్లోనూ ఇదే విధానం అనుసరించారు. బెంగాలీల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లటంలో విజయం సాధించారు. అందులో భాగంగానే 23 సూత్రాల ప్రణాళికను తీసుకొచ్చారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో నేరుగా మమేకవడం, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం... ఈ 'ఫార్ములా 23'లో ప్రధానాంశాలు.
ఇదీ చూడండి: మిషన్ బంగాల్: 23 అస్త్రాలతో భాజపా పక్కా ప్లాన్
మరింత బలోపేతం..
భాజపా 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. ఇలాంటి విధానాలతో పార్టీని మరింత బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలోనే 2019లో మరిన్ని ఓట్లు సాధించగలిగింది. ఈ పద్ధతులతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల సంఖ్యాబలం పెంచుకుంది. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుని.. నమో యాప్ ద్వారా వారందరినీ యాక్టివ్గా ఉంచగలిగింది. కేంద్ర ప్రభుత్వం విజయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగింది.
బూత్ స్థాయిల్లోనూ.. ఏ,బీ,సీ,డీలుగా విభజించి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లింది. డీ కేటగిరిలో మరింత శ్రమించేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. పార్టీ వర్కర్ల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని.. అందుకు అనుగుణంగా ప్రణాళికల్లో మార్పులు-చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగింది.