వీర్ సావర్కర్.. హిందూ మహాసభ నాయకుడు... స్వాతంత్య్ర సమరయోధుడు... ప్రస్తుతం భాజపా ఎన్నికల ప్రచారాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీల్లో ఆయన పేరును హైలెట్ చేస్తున్నారు. భారత స్వాతంత్య్రోద్యమానికి సావర్కర్ చేసిన సేవల్ని ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తోంది భాజపా. విపక్షాలను ఎదుర్కోవడానికి ఇదొక ఎత్తుగడలా ఉపయోగిస్తున్నారు.
హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ లేకపోయి ఉంటే... 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని బ్రిటిష్ చరిత్రకారుల కోణంలో కేవలం తిరుగుబాటుగానే పరిగణించేవారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీర్ సావర్కర్‌కు ఘననివాళి అర్పించిన షా.. చరిత్రను భారతీయ కోణంలో తిరిగి రాయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తమ మేనిఫెస్టోలో సావర్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కృషి చేస్తామని ప్రతిపాదించింది భాజపా. దీనిపై దుమారం రేగుతున్న నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
కాంగ్రెస్‌కు దూరం...
వీర్ సావర్కర్‌ను కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి. మహాత్మ గాంధీ హత్యతో ఆయనకు సంబంధముందని ఆరోపించాయి. అయితే.. సావర్కర్ నిర్దోషిగా నిరూపితమైంది. ఇప్పుడు.. భారతరత్న ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఈ నిర్ణయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సమర్థించారు. అయితే... కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది సావర్కర్‌ను కాదని, ఆయన ప్రవచించిన, మద్దతిచ్చిన హిందుత్వ భావజాలాన్నేనని చెప్పారు.
గతంలో సావర్కర్ స్మృత్యర్థం తపాలా బిళ్లను మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఆవిష్కరించారని, అందువల్ల తాము ఆయనకు వ్యతిరేకం కాదన్నారు మన్మోహన్. 'సత్కారాలు ఎప్పుడు చేయాలి? అసలు చేయాలా? వద్దా?' అనే అంశాలను ప్రభుత్వం నిర్ణయించాలన్నారు.