తెల్లారితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో? నలుగురు కలిసి చర్చిస్తున్నారని తెలిస్తే అవి కూలదోయడం గురించిన చర్చలేమోననే సందేహం..! ఇలా కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వ భవిత దినదినగండం... నూరేళ్ల ఆయుష్షు తరహాలో నడిచింది. చేయి చేయి కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ మధ్య మొదటి నుంచి విభేదాలే. ఓ పార్టీ నేత మరో పార్టీ నేతపై ఆరోపణలు చేయటం... తీవ్ర స్థాయిలో విమర్శించుకోవడం వారి మధ్య సర్వ సాధారణం.
దినదినగండం...
ముఖ్యమంత్రి పీఠం పూల పాన్పు కాదు... ముళ్ల పాన్పు! ఆ మధ్య కర్ణాటక సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలివి. ఏదో పదవిలో ఉన్నాననే కానీ... రోజుకో సమస్య చుట్టుముడుతోందన్నది ఆయన మాటల్లోని అంతరార్థం.
కుమారస్వామి పాలనపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందని, అందుకే జేడీఎస్‌తో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉందన్న ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపించాయి. కుమారస్వామి మాత్రం... తమ కూటమిలో ఎలాంటి విభేదాలు రాలేదని ఎప్పటికప్పుడు సర్ది చెబుతూ వచ్చారు. ఆయన ఎన్ని విధాలుగా సమర్థించుకున్నా... పార్టీల మధ్య ముసలం నడిచిందన్నది బహిరంగ రహస్యం.
కన్నీరు పెట్టిన కుమారస్వామి...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సరైన మెజారిటీ సీట్లు రాకపోవడం వల్ల భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. నాటి నుంచి ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కుస్తీ పడ్డాయి.
ఆరంభం నుంచి చివరి వరకు విభేదాలతోనే కాలం వెళ్లదీశాయి. విభేదాలను తట్టుకోలేక సీఎం కుమారస్వామి ఓసారి ఏకంగా కన్నీరు కూడా పెట్టుకున్నారు. కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వం నడపడం కష్టమే అని ఆయన అనడమూ అప్పట్లో సంచలనమైంది. మొదట్లో సాధారణంగా కనిపించినా.. రోజులు గడుస్తున్న కొద్దీ కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
అసంతృప్తి... ఆవేదన...