రెండేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి పరాభవం ఎదురైంది. తాజాగా 28 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడింట రెండొంతులకుపైగా స్థానాలను సొంతం చేసుకుంది. శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి ఢోకా లేకుండా పోయింది. ఉప ఎన్నికల్లో భాజపా విజయంలో యువనేత జ్యోతిరాదిత్య సింధియానే కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని వీడి, ఆయన వెంట వచ్చిన వారిలో చాలా మందిని గెలిపించుకోవడంలో సింధియా విజయం సాధించారు.
సింధియా ఎఫెక్ట్...
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి భాజపా తీర్థం పుచ్చుకున్న జ్యోతిరాదిత్య సింధియా వర్గం వైపే ఓటర్లు ఉన్నట్లు మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు 25 మంది కాంగ్రెస్ నుంచి భాజపాలోకి చేరగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భాజపా సర్కారు ఏర్పడింది. సింధియా వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు మరో 3 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఐతే ఆయా ప్రాంతాల్లో జ్యోతిరాదిత్య సింధియా తన పట్టు నిలుపుకున్నారు. ఉప ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేయడం, సింధియా ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా పోవడం వల్ల భాజపా విజయం మరింత సులువైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడటం వల్ల ప్రభుత్వ ఏర్పాటుపై ఆ పార్టీకి ఆశలు లేకుండా పోయాయి. ప్రస్తుతం 28 స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో మాత్రమే మెరుగైన ఫలితాలు సాధించింది.
ఇదీ చూడండి:-బిహార్ తీర్పు: అటు ఆనందం- ఇటు అసంతృప్తి