2022 నాటికి దేశంలోని పేద కుటుంబాలకు భాజపా ప్రభుత్వం పక్కా ఇళ్లు నిర్మిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దిల్లీలోని కడ్కడ్డూమ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. దేశ రాజధానిలోని అనధికారిక నివాసాల్లో సతమతమవుతున్న 40వేలకుపైగా ప్రజా జీవితాల్లో తమ ప్రభుత్వం వెలుగులు నిప్పిందని వెల్లడించారు. చట్టాని రూపొందించి వారి బాధలను తొలగించినట్టు పేర్కొన్నారు.
"దిల్లీలో ఒక పెద్ద సమస్య ఉండేది. అనధికారిక నివాస ప్రాంతాలు. స్వాతంత్ర్యం నుంచి ఈ సమస్య పరిష్కారానికి ఏదో ఒక రూపంలో అడ్డుపడుతోంది. ఓట్ల కోసం ఎన్నో వాదనలు చేశారు. కానీ సమస్యను ఎవరూ పరిష్కరించలేదు. దిల్లీలోని దాదాపు 40వేల మందిపైగా ప్రజల్లో ఉన్న చింతను మా ప్రభుత్వం తొలగించింది. తమ ఇళ్ల రిజిస్ట్రేషన్ జరుగుతుందని ఎవరైతే ఊహించలేదో... ఇప్పుడు వారి కలలు నిజం కావడం చూసి ఎంతో సంతోషిస్తున్నారు. ఇది దిల్లీ ప్రజలకు భాజపా ఇచ్చిన వాగ్దానం. ఇందులో భాగంగా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వీటన్నింటినీ ఎదిరించి... రాజ్యాంగంలో చట్టాన్ని రూపొందించి దిల్లీ ప్రజలకు ఈ అధికారం అందించాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
దిల్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తొలిసారి పాల్గొన్న మోదీ.. ఆప్ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో దిల్లీ ప్రజలు లబ్ధిపొందనివ్వకుండా ఆప్ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నంతవరకూ దిల్లీ ప్రజల అభివృద్ధిని కేజ్రీవాల్ అడ్డుకుంటారని మండిపడ్డారు. ద్వేషపూరిత రాజకీయాలు దేశంలో సాగవని... అభివృద్ధి విధానాలతోనే భారత్ ముందడుగు వేస్తుందని స్పష్టం ప్రధాని చేశారు.