మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను.. అధికార భాజపా స్వాగతించింది. అజిత్ పవార్.. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్నారనే వాదనను సుప్రీం ఆదేశాలు బలపరుస్తున్నాయని అభిప్రాయపడింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను స్వాగతించారు భాజపా నేత శేలర్. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల ఆట ముగిసిందన్నారు. ఎన్సీపీ శాసనసభ్యులకు అజిత్ పవార్ విప్ జారీ చేసే అధికారం ఉందని స్పష్టం చేశారు.
బలనిరూపణలో ఓడిపోతుంది: ఎన్సీపీ
దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం బల పరీక్షలో ఓడిపోతుందని ఉద్ఘాటించారు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్. ఫడణవీస్ తప్పుడు పత్రాలను చూపి.. ప్రమాణం చేశారని ఆరోపించారు. ఆయన వద్ద మెజారిటీకి సరిపడా సంఖ్యాబలం లేదని పేర్కొన్నారు మాలిక్. తనకు తాను తప్పుకోవాలని.. లేదంటే విశ్వాస పరీక్షలో ఓటమిని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.