బిహార్ ఎన్నికల వేడి రాజుకున్న వేళ.. భారతీయ జనతా పార్టీని ఓ అంతర్గత సర్వే పునరాలోచనలో పడేసింది. మిత్రపక్షం జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రజాదరణ రోజురోజుకీ క్షీణిస్తోందని తేలడం వల్ల భాజపా సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖచిత్రాన్నే ముందుపెట్టుకొని ప్రచారాలను హోరెత్తించాలని నిర్ణయానికొచ్చింది.
గందరగోళంలో భాజపా
ఇప్పటికే బలమైన మిత్రపక్షంగా ఉన్న జేడీయూకే పూర్తి సహకారం అందించాలా..? లేదంటే ఎన్డీఏలో భాగంగా ఉన్న లోక్ జనశక్తి పార్టీకి మద్దతు తెలపాలా..? అనే గందరగోళంలో ఉంది భాజపా. ప్రతిపక్షాలపై పోరాటం చేయాల్సిన దశలో ఎన్డీఏలోనే అంతర్గత ఘర్షణ రావటం వల్ల అప్రమత్తమైన భాజపా హైకమాండ్.. క్షేత్రస్థాయి కార్యకర్తలకు కీలక సూచనలు చేసింది. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించటమే లక్ష్యంగా పనిచేయాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.
అంతర్గత సర్వేలో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని తేలటం వల్ల బిహార్లో తమ విజయావకాశాలకు గండి పడుతుందని ఆందోళన చెందుతోంది భాజపా. ఈ నేపథ్యంలోనే బిహార్లో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు మోదీ. త్వరలోనే రాష్ట్రానికి భారీ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.