తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో భాజపా ఆపరేషన్​ 'ఆకర్ష్'​! - మెజరిటీ

మధ్యప్రదేశ్​లోని కాంగ్రెస్​​ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాలని భాజపా డిమాండ్​ చేసింది. ఇందుకోసం శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని గవర్నర్​ను కోరేందుకు సిద్ధమైంది. భాజపా, కాంగ్రెస్​కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యలో వ్యత్యాసం చాలా తక్కువ అయినందున... మధ్యప్రదేశ్​ రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మధ్యప్రదేశ్​లో భాజపా ఆపరేషన్​ 'ఆకర్ష్'​!

By

Published : May 20, 2019, 5:00 PM IST

Updated : May 20, 2019, 8:02 PM IST

మధ్యప్రదేశ్​లో భాజపా ఆపరేషన్​ 'ఆకర్ష్'​!

కేంద్రంలో మరోమారు అధికారం ఖాయమన్న ఎగ్జిట్​ పోల్స్​ నేపథ్యంలో భాజపా దూకుడు పెంచింది. మధ్యప్రదేశ్​ పీఠంపై గురిపెట్టింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కమల్‌నాథ్‌ ప్రభుత్వం శాసనసభలో మెజార్టీ నిరూపించుకోవాలని భాజపా డిమాండ్‌ చేసింది.

కీలక అంశాలపై చర్చించడానికి, కాంగ్రెస్‌ ప్రభుత్వ బలపరీక్ష కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్‌ను కోరనున్నట్లు ప్రతిపక్ష నేత గోపాల్‌ భార్గవ వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్‌కు త్వరలోనే లేఖ రాయనున్నట్లు తెలిపారు.

రైతు రుణ మాఫీ, కీలక అంశాలతో పాటు ప్రభుత్వ బలపరీక్షపై చర్చించనున్నట్లు వివరించారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న 21 లక్షల మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని గోపాల్‌ భార్గవ డిమాండ్‌ చేశారు. ముఖ్య అంశాలపై చర్చించకుండా కాంగ్రెస్‌ పారిపోతోందని విమర్శించారు.

'ప్రజాతీర్పును హేళన చేస్తున్నారు'

భాజపాపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భాజపా అనైతిక చర్యలతో కమల్​నాథ్​​ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రయత్నిస్తోందని మధ్యప్రదేశ్​ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దీపక్​ బబరియా ఆరోపించారు. మధ్యప్రదేశ్​ ప్రజలు భాజపాను కాదని.. కాంగ్రెస్​ను ఎన్నుకున్నారని తెలిపారు. ఇలాంటి చర్యలతో కమలదళం ప్రజాతీర్పును అగౌరవపరుస్తోందని విమర్శించారు.

ఎవరి బలమెంత..?

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 చోట్ల గెలుపొందింది. భాజపా 109 స్థానాలతో రెండో స్థానంలో ఉంది. బీఎస్పీ 2, సమాజ్‌వాదీ పార్టీ ఒకటి, స్వతంత్రులు 4 స్థానాలు సొంతం చేసుకున్నారు. బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Last Updated : May 20, 2019, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details