తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సవాళ్ల మధ్య ప్రస్థానం.. అంచనాలను అందుకోని భాజపా - తెలుగు జాతీయం రాజకీయం వార్తలు

ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే భాజపా హవా కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​ విధాన సభ ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి.

bjp views of elections is decreasing day by day as per the results of latest elections
అంచనాలను అందుకోలేకపోతున్న భాజపా

By

Published : Dec 9, 2019, 7:39 AM IST

Updated : Dec 9, 2019, 8:09 AM IST

ఇటీవలి ఎన్నికల ఫలితాలను చూస్తే భారతీయ జనతాపార్టీ ఊపు తగ్గినట్లు అర్థమవుతోంది. 2019 మే లోక్‌సభ ఎన్నికల్లో 302 సీట్లు గెలిచి రికార్డు సృష్టించిన భాజపాకు ఆ తరవాత నుంచి విధానసభ ఎన్నికల్లో వరసగా సమస్యలు తలెత్తు తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో అనూహ్య విజయం సాధించిన అనంతరమూ భాజపాకు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ విధాన సభ ఎన్నికల ఫలితాలు అందుకు నిదర్శనం. తరవాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ-షా జంట రెట్టింపు ఉత్సాహంతో పోరాడి అద్భుత విజయం సాధించారు. అటుపైన భాజపా హరియాణా విధాన సభలో మెజారిటీ సాధించలేకపోవడం, మహారాష్ట్రలో శివసేనతో కలిసి ఆధిక్యత సాధించినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం భాజపా గణాలను నిరాశానిస్పృహలకు గురిచేశాయి.

అందువల్లే మోదీ పట్టించుకోవట్లేదా!

మహారాష్ట్రలో శివసేన ద్రోహం చేసిందని బాధపడేవారికన్నా కేంద్ర నాయకత్వం శివసేనను దారికి తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నించలేదని బాధపడేవారే కాషాయ పార్టీలో ఎక్కువ. శరద్‌ పవార్‌ చాణక్యం ముందు దేవేంద్ర ఫడణవీస్‌ తేలిపోయినా, కేంద్ర నాయకత్వం చేతులు ముడుచుకుని కూర్చోవడం భాజపా నాయకులు, కార్యకర్తలకు ఏమాత్రం రుచించలేదు. వారు ఒక విధమైన నిస్తేజంలోకి జారిపోయారు. గతేడాది మధ్యప్రదేశ్‌లో అరడజను ఎమ్మెల్యేలను భాజపా వైపు తిప్పుకోవడానికి అగ్ర నాయకత్వం కనీస ప్రయత్నం చేయకపోవడంతో వారు కమల్‌నాథ్‌ పక్కన చేరి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటానికి తోడ్పడ్డారు. అదే పార్టీ కేంద్ర నాయకత్వం తలచుకొని ఉంటే శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో మళ్ళీ భాజపా ప్రభుత్వమే ఏర్పడేది. ఆ పని జరగలేదంటే కారణం- పార్టీ నాయకుల మధ్య కీచులాటలే! ప్రస్తుత ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని గట్టెక్కించి శీఘ్ర ప్రగతి పథంలో పరుగు తీయించడంపైనే మోదీ దృష్టి పెడుతున్నందువల్ల రాష్ట్రాల్లో జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనా వినిపిస్తోంది.

మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో అధికారం కోసం అడ్డతోవలు తొక్కి తమ ప్రతిష్ఠకు భంగం కలిగించుకోవడం మోదీకి ఇష్టం లేదని మరికొందరు వాదిస్తున్నారు. పార్టీ నిర్వహణలో సాటి లేని మేటి అయిన అమిత్‌ షాను ప్రభుత్వంలోకి తీసుకుని శక్తిమంతమైన హోం మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఆయన ఇదివరకటిలా పార్టీ వ్యవహారాలు చూసుకోలేకపోతున్నారని, రాష్ట్రాల్లో పరాజయాలకు ఇదీ ఓ ముఖ్య కారణమని కొందరు వివరిస్తున్నారు. హోం శాఖతోపాటు షా అనేక ఇతర మంత్రిత్వ శాఖలనూ పర్యవేక్షిస్తుంటారు. ఫలితంగా ఆయనకు పార్టీపై శ్రద్ధ పెట్టే సమయం ఉండటం లేదన్న మాట వినిపిస్తోంది.

ఆనాటి అనుభవాలు ఏం చెప్తున్నాయి?

ఏ పార్టీ అయినా, ఏ అధినాయకుడైనా అయిదేళ్లపాటు అధికారంలో ఉన్నాక వారి సాఫల్యవైఫల్యాలను ప్రజలు బేరీజు వేసుకొని మరీ తీర్పు చెబుతారు. ప్రజలకు, నాయకుడికి మధ్య అనుబంధం ఎల్లకాలం ఒక్క తీరుగా ఉండదు. నాయకుడు లేదా నాయకురాలి పనితీరు ఆ బంధం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. 1971లో లోక్‌సభలో మూడు వంతుల సీట్లు గెలుచుకుని అఖండ విజయం అందుకున్న ఇందిరాగాంధీ 1974 వచ్చేసరికి ఎమర్జన్సీ విధించి ప్రజలకు దూరమయ్యారు. అభిమానం కాస్తా ద్వేషంగా మారింది. జీవితంలోలాగే రాజకీయాల్లోనూ ఏదీ శాశ్వతం కాదు. మహారాష్ట్ర ఉదంతం తరవాత భాజపా నాయకత్వం ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి.

ఇందిరా గాంధీ హత్యానంతరం 1984లో దిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతకు నాటి హోం మంత్రి పీవీ నరసింహారావు ఉపేక్షాభావమే కారణమని సింగ్‌ వ్యాఖ్యానించడంపై విమర్శలు హోరెత్తుతున్నాయి. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ సంస్మరణ సభలో మన్మోహన్‌ ఈ వ్యాఖ్య చేశారు. దిల్లీలో సైన్యాన్ని దింపి సిక్కుల ఊచకోతను ఆపాలని గుజ్రాల్‌ ఎంత చెప్పినా నరసింహారావు వినలేదని మన్మోహన్‌ వివరించారు. దీంతో సిక్కులపై హత్యాకాండ నిరాటంకంగా సాగిపోయిందన్నారు. పదవీ విరమణ చేసి ఇంటిపట్టున ఉన్న తనను పీవీయే తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేశారన్న సంగతిని మన్మోహన్‌ మరచిపోయారు. తనకు ఉపకారం చేసిన పీవీపైనే బురద జల్లారు. ఇక మన్మోహన్‌ తనను ప్రధానమంత్రిని చేసిన నెహ్రూ కుటుంబం పట్ల విధేయత ప్రకటించుకున్నారు. 1984 అల్లర్లను అణచివేయడానికి సైన్యాన్ని దింపాలని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ ఆదేశించకపోవడం వల్ల పీవీ తన బాధ్యత నెరవేర్చలేకపోయారు. తన తల్లి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని, సిక్కులకు బుద్ధి చెప్పాలని రాజీవ్‌ భావించడం వల్ల 4,000 మంది సిక్కులు బలయ్యారు. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న మన్మోహన్‌ ఈ దారుణంపై నోరు మెదపలేదు. అలాంటి వ్యక్తి పీవీని తప్పు పట్టడం విడ్డూరం.

Last Updated : Dec 9, 2019, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details