జాతీయ పౌర పట్టిక అమలుపై భిన్నంగా స్పందిస్తూ దేశాన్ని భాజపా మోసం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేర్వేరు వివరణలు ఇచ్చారని కాంగ్రెస్ మండిపడింది.
"నిరసనలపై చర్చకు స్వాగతం మోదీ. దేశం మీకోసమే ఎదురుచూస్తోంది. దేశంలో పెరుగుతున్న అశాంతిపై మీరు తొలిసారి మాట్లాడిన దానిలోనే ఎన్నో అబద్ధాలు ఉండటం బాధాకరం. విభజన రాజకీయాలు చేసే మీ నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?"
-కాంగ్రెస్ పార్టీ
ఎన్ఆర్సీపై మోదీ-షా మాటలు వేర్వేరుగా ఉన్నాయని, ఇద్దరి మధ్య సఖ్యత లేదా అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు.
"దేశవ్యాప్త ఎన్ఆర్సీపై ఎలాంటి చర్చా లేదని దిల్లీలో మోదీ అంటారు. కానీ ఝార్ఖండ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్సీ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ప్రధాని, హోంమంత్రి మధ్య సఖ్యత లేదా? అధికారం, పార్టీ మధ్య ఏమైనా విభేదాలున్నాయా? లేదా ఇద్దరు కలిసి దేశ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారా? ఇంకా ఎంత కాలం?"
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి