మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ భాజపా, శివసేన మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ పార్టీకి ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు రాష్ట్ర మంత్రి, భాజపా నేత సుధీర్ ముంగంటివార్.
"హరియాణాలో భాజపా, దుష్యంత్ చౌతాలా పార్టీ జేజేపీ కలిసి పోటీ చేయలేదు. కూటమి అంటే ఒప్పందం. కానీ ఇలాంటి ప్రకటనలు 'వినాశ కాలే విపరీత బుద్ధి' అనే సామెతకు అద్దం పడతాయి.
శివసేనకు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు భాజపాకు ఉండవా? భాజపాకూ ఉన్నాయి. శివసేనకు చాలా మంది మద్దతుగా వస్తున్నట్లయితే.. అలాగే భాజపాకు మద్దతిచ్చేందుకు చాలా మంది ముందుకు వస్తారు. ఇక్కడ సమస్య ఏమిటంటే.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రజలు తీర్పు ఇచ్చారు."
- సుధీర్ ముంగంటివార్, భాజపా నేత