బిహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. వర్చువల్, ఆన్లైన్ వేదికల ద్వారా ప్రజలను చేరుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం 'కమల్ కనెక్ట్'ను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించింది.
అనేక హంగులతో..
ఈ యాప్ను తక్కువ డేటా వినియోగించే విధంగా రూపొందించారు. ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉండే మారుమూల ప్రాంతాల్లోనూ దీనిని ఉపయోగించవచ్చు. దీని ద్వారా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎంత మంది లబ్ధిపొందారో పొందుపరిచారు. గత ఆరేళ్లలో బిహార్ కోసం కేంద్రం చేసిన కృషిని కూడా ఈ యాప్ వివరిస్తుంది.
అంతేకాకుండా, భాజపా నేతల బహిరంగ ప్రసంగాలను కూడా ప్రజలకు చేరడానికి ఈ యాప్ను ఉపయోగించనున్నారు. ప్రజల సమస్యలపై స్పందించే ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమ వేదికలనూ దీనికి అనుసంధానం చేయనున్నారు.