వ్యవసాయ బిల్లులపై చెలరేగిన వివాదానికి చెక్ పెట్టేందుకు భాజపా భారీ స్థాయిలో సన్నద్ధమైంది. బిల్లులపై రైతుల్లో అవగాహన కల్పించే విధంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని... ప్రజల్లోకి వెళ్లి బిల్లుల్లోని విషయాలను వివరించాలని భాజపా సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు పార్టీ ఈ చర్యలు చేపట్టింది.
విస్తృతంగా ప్రచారాలు...
7 రాష్ట్రాల్లో 15రోజుల పాటు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది భాజపా. వీడియో కాన్ఫరెన్స్, వెబినార్లు, సమావేశాల ద్వారా రైతులకు అవగాహన కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఇదీ చూడండి:-ఎన్డీఏతో అకాలీదళ్ తెగదెంపులు-కూటమి నుంచి క్విట్
ఇదే విషయంపై రాజస్థాన్, జమ్ముకశ్మీర్, పంజాబ్, హరియాణా, ఛండీగఢ్, హిమాచల్‌ప్రదేశ్, దిల్లీలోని రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఇంఛార్జ్‌లకు ఇప్పటికే ఓ సర్కులర్ అందించారు భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్. ప్రచార కార్యక్రమాలు నిర్వహించి.. రైతుల్లో విపక్షాలు తీసుకొచ్చిన భయాలను తొలగించాలని స్పష్టం చేశారు. చారిత్రక బిల్లులతో కలిగే సత్ఫలితాలను వివరించాలని పేర్కొన్నారు.