నూతన సాగు చట్టాలపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించేలా భారతీయ జనతా పార్టీ(భాజపా) చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటికే జిల్లా, తాలుకా స్థాయిల్లో ప్రెస్ కాన్ఫరెన్సులు, జన సంపర్క్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి(డిసెంబర్ 25)ని.. రైతులకు అంకితమిచ్చింది. అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈ రోజున ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. ఈ మేరకు డిసెంబర్ 25న వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ సైతం ఈ కార్యక్రమాలకు హాజరై, ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
"వాజ్పేయీ జయంతి కాకుండా రైతులకు అంకితమివ్వడానికి ఇంకో ఉత్తమమైన రోజు ఏముంటుంది. రైతుల కోసం (ఎన్డీఏ)ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి వంటి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. వీటిపై ప్రధాని నేరుగా మాట్లాడితే.. ప్రజలందరికీ సమాచారం సులభంగా చేరువవుతుంది."