దిల్లీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. తాజాగా భాజపా లక్ష్యంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. తనను ఓడించడానికి స్థానిక ఆటో డ్రైవర్లపై భాజపా సర్కారు తన ప్రతాపాన్ని చూపిస్తోందని ఆరోపించారు. తనపై ప్రేమను కురిపిస్తుండటం వల్లే ఓ ఆటోవాలాలపై చలాన్లతో విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మీడియా కథనాలను చూపిస్తూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
"భాజపా తన పోలీసులతో నకిలీ చలాన్లు సృష్టించి... పేద డ్రైవర్లను చిత్రహింసలు పెడుతోంది. 'ఐ లవ్ కేజ్రీవాల్' అని తన ఆటోపై రాసుకోవడమే ఆ డ్రైవర్ చేసిన తప్పు. అందుకే 10వేల రూపాయలు చలానా వేశారు. ఇలా చేయడం సరికాదు. పేద వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మానుకోండి."
--- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి