తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫడణవీస్​కు మిత్రలాభం..శివసైనికుల సంబరం - భాజపా-శివసేన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-శివసేన కూటమి ఆపసోపాలు పడుతూ గెలుపుతీరం చేరుకుంది. ఎగ్జిట్​ పోల్స్ అంచనాలను భిన్నంగా కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఈ ఏడాది జరిగిన లోక్​సభ ఎన్నికలతో పోల్చితే భాజపాకు భారీగా ఓటింగ్ శాతం తగ్గింది. అయితే మిత్రలాభం వల్ల మహారాష్ట్ర పగ్గాలు.. భాజపా-శివసేన కూటమికే దక్కాయి.

మహా మిత్రలాభం... మహారాష్ట్ర పగ్గాలు భాజపా-శివసేనకే

By

Published : Oct 25, 2019, 6:20 AM IST

మహా మిత్రలాభం... మహారాష్ట్ర పగ్గాలు భాజపా-శివసేనకే

మహారాష్ట్రలో కొద్దినెలల క్రితం లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన భాజపా-శివసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఆపసోపాలు పడుతూ గెలిచింది. 2014 ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసి 122, 63 స్థానాల్లో గెలిచిన భాజపా, శివసేన.. ఇపుడు కలిసి పోటీచేసినా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. 288 స్థానాలకు గాను 230 తమవేనని ఇరు పార్టీల నాయకులూ ధీమాగా ఉన్నా ఫలితాలు భిన్నంగా వచ్చాయి.

వైఫల్యభారం భాజపాదే..

మరాఠా రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం కనుగొనడం, రైతుల ఆందోళనను కొంత చల్లార్చడం వల్ల మంచి ఫలితాలే వస్తాయని భాజపా ఆశించింది. కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా చెప్పాయి. కానీ ఓటర్లు భిన్నంగా స్పందించారు. గడిచిన 12-15 నెలల్లో చాలామంది కాంగ్రెస్‌, ఎన్‌సీపీ నేతలు భాజపా, శివసేనలలోకి వచ్చారు. కానీ వారిలో పలువురిపై కేసులుండటంతో కూటమి విజయావకాశాలకు వారే అవరోధంగా నిలిచారు. పశ్చిమ మహారాష్ట్రలో బలాన్ని భాజపా పెంచుకోలేకపోయింది. శరద్‌పవార్‌పై సహకారబ్యాంకు కేసు ఉన్నట్టుండి ముందుకు రావడం అక్కడి ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. పుణె, నాసిక్‌, ఔరంగాబాద్‌ లాంటి పారిశ్రామిక నగరాల్లో ఆర్థికమాంద్యం ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. నాగ్‌పుర్‌ లాంటి ప్రాంతాలను భాజపాకు కంచుకోటలుగా భావిస్తారు. కానీ అక్కడ పార్టీ అభ్యర్థుల ఆధిక్యాలు నామమాత్రంగానే ఉండటంతో పాటు రెండుస్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది!

శివసైనికుల సంబరం

గత అయిదేళ్లుగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. శివసేన దాదాపు ప్రతిపక్షంలాగే వ్యవహరించింది. లోక్‌సభ ఎన్నికల నుంచి స్వరం మార్చి మళ్లీ భాజపా వెంట నడిచింది. ఆ ఎన్నికల్లో 18 స్థానాలు సాధించి సంబరం చేసుకుంది. శాసనసభ ఎన్నికల్లో 100 స్థానాలు ఆశించినా, 56తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఫలితాల తర్వాత ఎక్కువ సంతోషించింది వాళ్లేనన్నది ఉద్ధవ్‌ ఠాక్రే మాటలు, చేతల్లో స్పష్టమైంది. దేవేంద్ర ఫడణవీస్‌ భాజపా కార్యాలయంలోకి వెళ్లబోతుండగా ఠాక్రే మీడియాతో మాట్లాడటం మొదలుపెట్టడం, టీవీ ఛానళ్లన్నీ దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుండటంతో అది అయ్యేవరకు ఫడణవీస్‌ ఆగాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో తమకే సొంతంగా ఆధిక్యం వస్తుందని, శివసేన మద్దతు లేకున్నా ప్రభుత్వం ఏర్పాటుచేయగలమని భాజపా చెబుతూ వచ్చినా.. ఫలితాలు వేరేగా వచ్చాయి. అదే శివసేనకు కలిసొచ్చింది. 2014 ఎన్నికల నాటికి.. ఇప్పటికి పరిస్థితి గణనీయంగా మారడంతో శివసేనతో వ్యవహరించే విషయంలో భాజపా కాస్త తగ్గాల్సి వస్తోంది. కానీ, రాష్ట్రంలో శివసేన బలమూ కొంత తగ్గింది. ముంబయిలో కొన్నిచోట్ల వాళ్లకంటే భాజపానే మెరుగ్గా ఉంది. బాంద్రాలో శివసేన అభ్యర్థి, ప్రస్తుత మేయర్‌ ఓడిపోయారు. కొంకణ్‌లోనూ ఓటమి తప్పలేదు. భాజపాతో బేరాల విషయంలో మాత్రం పరిస్థితి మెరుగుపడటంతో శివసైనికులు సంతోషంగా కనిపిస్తున్నారు.

పీఠంపై శివసేన పట్టు

మహారాష్ట్ర

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై ఈసారి కూర్చొనేది శివసైనికుడేనని ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పిన శివసేన... తదనుగుణంగా పావులు కదుపుతోంది. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవాలన్న భాజపా ఆశలు ఫలించకపోవడంతో ఇదే అదనుగా సీఎం పదవి కోసం పట్టుబట్టే అవకాశాలున్నాయి. అధికారాన్ని చెరి సగం చొప్పున పంచుకునేందుకు భాజపా తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమయిందని పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం గుర్తుచేశారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుపడతామని చెప్పకనే చెప్పారు. ‘‘లోక్‌సభ ఎన్నికలకు ముందు భాజపా అధ్యక్షుడు అమిత్‌షా మా ఇంటికి వచ్చి పొత్తుపై చర్చలు జరిపినప్పుడు అధికారాన్ని 50:50 నిష్పత్తిలో పంచుకునేందుకు ఒప్పందం కుదిరింది. దానినిప్పుడు గౌరవించాలి’’ అని ఆయనన్నారు. ‘‘భాజపా అభ్యర్థన మేరకు మేం తక్కువ స్థానాల్లోనే పోటీకి అంగీకరించాం. ప్రతిసారి అంతలా సర్దుకుపోవడం సాధ్యం కాదు. మా పార్టీని కూడా ఎదగనివ్వాలి కదా’’ అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేతలతో, భాజపాతో మాట్లాడి.. అధికారాన్ని పంచుకునే సూత్రంపై శాంతియుతంగా, పారదర్శకంగా అవగాహనకు వస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:'అభివృద్ధి అజెండానే మరోసారి పట్టం కట్టింది'

ABOUT THE AUTHOR

...view details