తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విరాళాల సేకరణలో భాజపాదే అగ్రస్థానం' - కార్పొరేట్లు

కార్పొరేట్​ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించిన జాతీయ పార్టీల్లో భాజపా ముందంజలో ఉందని ఏడీఆర్ (ది అసోసియేషన్​ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ ) విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. 2016-18 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆ పార్టీ సుమారు రూ.900 కోట్ల విరాళాలు సేకరించింది. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన జాతీయ పార్టీలు విరాళాల స్వీకరణలో చాలా వెనుకంజలో ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

విరాళాల సేకరణలో భాజపా తర్వాతే ఎవరైనా..!

By

Published : Jul 10, 2019, 5:18 AM IST

Updated : Jul 10, 2019, 7:31 AM IST

కార్పొరేట్ల నుంచి భారీ విరాళాలు పొందిన జాతీయ పార్టీల్లో భాజపా అగ్రస్థానంలో నిలిచింది. 2016-18 సంవత్సరాల మధ్య ఆ పార్టీకి 1,731 కార్పొరేట్లు విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాల విలువ సుమారు రూ.900 కోట్లు. అదే సమయంలో కాంగ్రెస్ సేకరించిన విరాళాల కంటే ఇది 16 రెట్లు అధికం అన్నమాట. ది అసోసియేషన్ ఫర్​ డెమొక్రాటిక్​ రిఫార్మ్స్​ (ఏడీఆర్​) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం, 2016-18 మధ్య కాలంలో వ్యాపార సంస్థలు మొత్తంగా రూ.985.18 కోట్ల విరాళాలు ఇచ్చాయి. ఈ విరాళాల్లో రాజకీయ పార్టీలకు ఇచ్చిన వాటా సుమారు 93 శాతం కావడం గమనార్హం.

భాజపాదే అగ్రస్థానం..

"ఆరు జాతీయ పార్టీల్లో.... 2016-18 సంవత్సరాలకు గాను.....భాజపా గరిష్ఠంగా రూ.915.569 కోట్ల విరాళాలు పొందింది. ఈ విరాళాలను 1731 మంది కార్పొరేట్ దాతలు అందించారు. భాజపా తరువాతి స్థానంలో నిలిచిన కాంగ్రెస్...151 మంది కార్పొరేట్ల నుంచి కేవలం రూ.55.36 కోట్ల విరాళాలు మాత్రమే సేకరించగలిగింది. ఎన్​సీపీ 23 కార్పొరేట్ల నుంచి రూ.7.37 కోట్ల విరాళాలు పొందింది." - ఏడీఆర్​ నివేదిక

2016-17 మరియు 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో కార్పొరేట్లు స్వచ్ఛందంగా అందించిన.... రూ.20 వేలు మించిన విరాళాలను భాజపా 94 శాతం, కాంగ్రెస్ 81 శాతం వరకు పొందాయి.

2012-13 నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరాల మధ్య కార్పొరేట్ల నుంచి భాజపా దాదాపు రూ.1621.40 కోట్లను విరాళాలుగా పొందింది. ఇది ఆ 6 సంవత్సరాల్లో కార్పొరేట్లు అందరూ ఇచ్చిన విరాళాల్లో 83.49 శాతం కావడం గమనార్హం.

పెరుగుతున్న కార్పొరేట్ విరాళాలు

ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం 2004-05 నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో... జాతీయపార్టీలకు కార్పొరేట్లు అందించే విరాళాలు 160 శాతం పెరిగాయి.

2012-13 నుంచి 2017-18 మధ్యకాలంలో తీసుకుంటే ఈ విరాళాలు 414% పెరిగాయి. ఒక్క 2015-16 సంవత్సరంలో మాత్రం కార్పొరేట్ విరాళాల్లో తగ్గుదల కనిపించింది.

జాతీయ పార్టీలు

ఏడీఆర్... ఆరు జాతీయ పార్టీలను పరిగణనలోకి తీసుకొని తాజా నివేదిక రూపొందించింది. ఆ రాజకీయ పార్టీలు.. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్​సీపీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), సీపీఎమ్​, ఆల్​ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ).

మరో జాతీయ పార్టీ బీఎస్పీని.... ఏడీఆర్​ పరిగణించలేదు. ఎందుకంటే 2004 నుంచి రూ.20 వేలు మించిన స్వచ్ఛంద విరాళాలు తమకు రాలేదని ఆ పార్టీ ప్రకటించింది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం అత్యంత తక్కువ కార్పొరేట్ విరాళాలు (2 శాతం) పొందుతున్న జాతీయపార్టీ సీపీఐ.

ఇదీ చూడండి: భారత్​పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ గుస్సా

Last Updated : Jul 10, 2019, 7:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details