మన్మోహన్ ప్రసంగంతో కాంగ్రెస్కు భాజపా పంచ్ పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై భాజపా ఎదురుదాడికి దిగింది. ఈ చట్టాన్ని సమర్థిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2003లో రాజ్యసభలో చేసిన ప్రసంగం వీడియోను విడుదల చేసింది.
ఈ మేరకు పార్టీ ట్విట్టర్ ఖాతాలో మన్మోహన్ వీడియోను పోస్ట్ చేసిన భాజపా... ఆయన చెప్పినట్లుగానే తాము పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించింది. మత పీడన కారణంగా భారత్‌కు శరణార్థులుగా వచ్చిన వారి పట్ల ఉదారంగా వ్యవహరించి భారత పౌరసత్వం కల్పించాలని మన్మోహన్ ఈ వీడియోలో అన్నారు.
"దేశ విభజన తర్వాత బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో మైనార్టీలు మతపరమైన పీడనను ఎదుర్కొన్నారు. ఆయా పరిస్థితులను ఎదుర్కొని మన దేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం కల్పించడం మన నైతిక బాధ్యత. వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగా ఉప ప్రధానమంత్రి పౌరసత్వ చట్టాన్ని రూపొందిస్తారని ఆశిస్తున్నాను."
- మన్మోహన్ సింగ్
ఈ వీడియో 2003 నాటి పార్లమెంటు సమావేశాల్లోనిది. వాజ్పేయీ ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు-2003పై చర్చలో భాగంగా మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే వీడియోతో కాంగ్రెస్ను ఎదురుదెబ్బ కొట్టింది భాజపా.