దిల్లీ లోదీ ఎస్టేట్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నివాసముంటున్న బంగ్లాను భాజపా రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ జాతీయ మీడియా కార్యదర్శి అనిల్ బలూనికి కేటాయించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల అధికారి వెల్లడించారు. అనిల్ బలూని వినతి మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
1997లో ప్రభుత్వం దిల్లీలో కేటాయించిన నివాస గృహాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని జులై 1న ప్రియాంకా గాంధీకి నోటీసులు జారీ చేసింది కేంద్రం. ప్రభుత్వానికి రూ. 3.46 లక్షలు బకాయి ఉన్నట్లు నోటీసులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలో ప్రియాంక ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్.