బంగాల్లో రాజకీయాలు కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. అధికార టీఎంసీ నుంచి భాజపాలోకి వలసలు పెరిగిన తరుణంలో ఆ రాష్ట్ర భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత ఖాన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భాజపా నేతలకు షాకిస్తూ.. టీఎంసీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తన భర్త విజయానికి ఎన్నో రిస్కులు తీసుకున్న తనకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. అయితే.. ఇక్కడే అసలు కథ మొదలైంది. తన భార్య టీఎంసీలో చేరినట్లు తెలిసిన వెంటనే ఆమెకు విడాకులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఎంపీ సౌమిత్ర ఖాన్. తన పేరును ఎక్కడా వినియోగించుకోకూడదని స్పష్టం చేశారు.
టీఎంసీ ఎంపీ సౌగత రాయ్, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో పార్టీలో చేరారు సుజాత మొండల్. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నిర్ణయం తన భర్తపై ప్రభావం చూపుతుందా? అని అడిగిన ప్రశ్నకు.. అది ఆయన చేతిలోనే ఉందని సమాధానమిచ్చారు. ఏదో ఒకరోజు నిజానిజాలు తెలుసుకొని టీఎంసీలోకి తిరిగివస్తారన్న నమ్మకం ఉందన్నారు.
"నమ్మకస్తులను కాదని ఇటీవలే చేరిన అర్హత లేని, అవినీతి నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాషాయ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో నా భర్త గెలుపు కోసం ఎంతో త్యాగం చేశాను. అందుకు నాకు ప్రతిఫలం ఏమీ దక్కలేదు. మమతా బెనర్జీ, దాదా అభిషేక్ బెనర్జీ నాయకత్వంలో పని చేయాలనుకుంటున్నా. "