బంగాల్లో భాజపా లేవనెత్తిన 'జై శ్రీరామ్' సెగ కొనసాగుతోంది. కాషాయ దళం కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాన్ని వినియోగించటంపై తీవ్రంగా స్పందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జై శ్రీరామ్ నినాదంతో మతాన్ని భాజపా రాజకీయంలోకి లాగుతోందని మండిపడ్డారు దీదీ.
జై శ్రీరామ్, జై రామ్ జీ కీ, రామ్ నామ్ సత్య హై వంటి నినాదాలు మతపరమైనవని పేర్కొన్నారు దీదీ. వాటిని తాము గౌరవిస్తామన్నారు. కానీ జై శ్రీరామ్‌ను పార్టీ నినాదంగా భాజపా ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ తన ఫేస్బుక్ పోస్ట్‌లో రాసుకొచ్చారు మమత. మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు.
రాజకీయ ర్యాలీలు, పార్టీల కార్యక్రమాల్లో ప్రత్యేక నినాదాలు వినియోగిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఇతరులపై దౌర్జన్యంగా రాజకీయ నినాదాలను అమలు చేయాలనుకునే వారిని తాము గౌరవించమని తెలిపారు. ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేయాలనుకునే ప్రయత్నాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు దీదీ.