దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ వరుసగా మూడోసారి విజయఢంకా మోగించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ప్రచార పర్వంలో జాతీయ పార్టీలతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తలపడ్డారు. చివరకు జాతీయ పార్టీలను కాదని ఆప్‌ను సింహాసనంపై కూర్చొబెట్టారు హస్తిన ప్రజలు.
దిల్లీలో 70 స్థానాలకు గాను ఆప్ 62 కైవసం చేసుకోగా.. మిగిలిన 8 స్థానాలను భాజపా గెలుచుకుంది. ఆప్ 53.57 శాతం, భాజపా 38.51 శాతం, కాంగ్రెస్ 4.26 శాతం ఓట్లు సాధించాయి. ఆప్ కన్నా ముందు దిల్లీని 15 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది.
చతికిలబడిన కాంగ్రెస్..
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే ఆప్, భాజపా, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాలను హోరెత్తించాయి. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పట్టు కోల్పోయినట్లు కనిపించింది. దిల్లీ ఎన్నికలు ద్విముఖ పోరుగానే సాగాయి.
ఇదే కారణంతో తాము ఓటమి పాలయ్యాయమని భాజపా భావిస్తోంది. ఓట్ల శాతం గతంతో పోలిస్తే పెరిగినా.. స్థానాలను కైవసం చేసుకోవటంలో మాత్రం వెనకపడ్డామని అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.