శిరోమణి అకాలీదళ్, శివసేన.. దేశ రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాల పాటు భాజపా వెన్నంటే నిలిచిన పార్టీలివి. ఎన్నో కీలక సమయాల్లో భాజపాతో తమ బంధాన్ని ఈ పార్టీలు చాటిచెప్పాయి కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఏడాదిలోనే ఈ రెండు పార్టీలు భాజపాతో తెగదెంపులు చేసుకున్నాయి. మరి ఈ పరిణామాలతో భాజపాకు నష్టం కలుగుతుందా? అసలు ఈ పార్టీలు భాజపాను ఎందుకు వీడాయి?
బిల్లులు.. కలహాలు..
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం తీసుకొచ్చిన చట్టాలపై శిరోమణి అకాలీదళ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటితో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే వీటిని ఉపసంహరించుకోవాలని భాజపాకు తేల్చిచెప్పింది. అయినప్పటికీ ఈ విషయంలో భాజపా ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏను వీడుతున్నట్టు అకాలీదళ్ శనివారం ప్రకటించింది.
మరోవైపు గతేడాది 'మహా' ఎన్నికల వ్యవహారంలో భాజపా-శివసేన మధ్య కలహాలు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే అంశంపై భాజపాతో జరిగిన చర్చలు విఫలమవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల పట్ల ఆగ్రహించిన శివసేన.. ఆ పార్టీతో పొత్తును ముగించుకుంది. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
భాజపాకు నష్టమేనా?
ఈ పార్టీలతో విభేదాలు ఏర్పడటం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. కానీ సిద్ధాంతాల పరంగా.. ఈ రెండు పార్టీలు భాజపాకు ఎంతో కీలకం. ఈ కోణంలో చూస్తే వీటి స్థానాన్ని భర్తీ చేసే మిత్రపక్షాలు భాజపాకు లేవనే చెప్పుకోవాలి.
అదే సమయంలో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో అకాలీలకు ప్రాముఖ్యత ఎక్కువే. అకాలీదళ్‌తో కలిసి ఉండటం వల్ల భాజపాకు రాజకీయం పరంగా ఇన్నేళ్లు మేలే జరిగిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇరు పార్టీలు కలిసి వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించేవని.. ఇప్పుడు అకాలీదళ్ తప్పుకోవడం వల్ల భాజపా రాజకీయపరంగా నష్టపోయే అవకాశమున్నట్టు అభిప్రాయపడుతున్నారు.