తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దంగల్​: హరియాణాలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం - హరియాణాలో పోరుకు సర్వం సిద్ధం

హరియాణా శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 90 స్థానాలకు సోమవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 1,169 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కోటీ 83 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.

దంగల్​: హరియాణాలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

By

Published : Oct 20, 2019, 5:51 PM IST

Updated : Oct 20, 2019, 7:55 PM IST

దంగల్​: హరియాణాలో రసవత్తర పోరుకు రంగం సిద్ధం

హరియాణా ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 90 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 1,169 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 105 మంది మహిళలు. 85 లక్షల మంది మహిళా ఓటర్లు సహా మొత్తం ఒక కోటీ 83 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

హరియాణా అసెంబ్లీ పోరు

నియోజకవర్గాలు: 90

అభ్యర్థులు: 1,169

ఓటర్లు: 1,83,00000

పోలింగ్​ కేంద్రాలు: 19,578

భద్రతా సిబ్బంది: 75,000

వీవీప్యాట్ యంత్రాలు: 27,611

భారీ భద్రత...

పోలింగ్‌ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 75 వేల మంది పోలీసులను, 130 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.

నువ్వా-నేనా...

90 శాసనసభ స్థానాలున్న హరియాణాలో భాజపా,కాంగ్రెస్​తో పాటు ఐఎన్​ఎల్​డీ, జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ), హరియాణా జన్‌హిత్‌ కాంగ్రెస్‌ (హెచ్​జేసీ), ఆమ్ ఆద్మీ పార్టీ , బహుజన్ సమాజ్ పార్టీ, స్వరాజ్ ఇండియా తదితర చిన్నపార్టీలూ పోటీ పడుతున్నాయి. అయితే ప్రధానంగా భాజపా-కాంగ్రెస్, జేజేపీ​ మధ్యనే పోరు నడిచే అవకాశం ఉంది. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాషాయ పార్టీ పట్టుదలగా ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్​ విశ్వప్రయత్నాలు చేసింది.

ప్రముఖుల పోరు...

ప్రస్తుత ముఖ్యమంత్రి, భాజపా నేత మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నాల్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ సీఎం, సీఎల్పీ నేత భూపీందర్ సింగ్ హుడా గర్హీ సంప్లా- కిలోయ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కాంగ్రెస్ నుంచి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, జేజేపీ నుంచి దుష్యంత్ చౌతాలా, ఐఎన్​ఎల్​డీ నుంచి అభయ్ సింగ్ చౌతాలా తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు.

హరియాణా శాసనసభ ఎన్నికల సమరంలో భాజపా ముగ్గురు క్రీడాకారులను బరిలోకి దింపింది. దాద్రి నియోజకవర్గం నుంచి రెజ్లర్ బబితా ఫొగట్, సోనిపట్‌లోని బరోడా నుంచి యోగేశ్వర్ దత్, పెహోవా నుంచి హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్‌ను బరిలో నిలిపింది.

2014లో...

2014 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 47 చోట్ల గెలుపొందింది. ఆ తర్వాత జింద్‌ ఉప ఎన్నిక నెగ్గి బలాన్ని 48కి పెంచుకుంది. ఐఎన్​ఎల్​డీకి 19, కాంగ్రెస్‌కు 17 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్‌ ఒక్కో చోట నెగ్గాయి. ఐదు చోట్ల స్వతంత్రులు గెలిచారు.

Last Updated : Oct 20, 2019, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details