దక్షిణాదిలో పాగా వేసేందుకు భాజపా వ్యూహరచన! దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది భాజపా. ఇందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల నుంచి ప్రజాకర్షణ కల్గిన బడా నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. పార్టీలో స్థానికంగా కొత్త నాయకులకు అవకాశాలు కల్పించి ఉనికి పెంచుకోవాలని చూస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది భాజపా. కీలక ప్రతిపక్ష నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు కమలం గూటికి చేరారు.
తెలంగాణలోనూ ఇతర పార్టీల ముఖ్య నేతలను భాజపాలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కమలనాథులు. కాంగ్రెస్‌కు తగ్గుతున్న ఆదరణను, తెరాస ప్రభుత్వంపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని భావిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది భాజపా. గతంలో కంటే మూడు సీట్లు అదనంగా గెలిచింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 2 స్థానాల్లో గెలుపొందగా... ఈసారి ఖాతా తెరవలేకపోయింది.
తమిళనాడు, కేరళపై ప్రత్యేక దృష్టి
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజలు మోదీకి బ్రహ్మరథం పట్టినా... తమిళనాడు, కేరళ నుంచి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది భాజపా. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం ఎంపీ స్థానాలు 84.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు, దివంగత నేతలు కరుణానిధి, జయలలిత మృతితో ఆ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని భాజపా భావిస్తోంది. కొత్త నాయకులకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో నూతనోత్తేజం నెలకొంటుందనే ఉద్దేశంతోనే... తమిళనాడు భాజపా అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించేందుకు భాజపాకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు ఆ నేత. తమ కార్యాచరణతో ఈ రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఎదుగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఆదరణ కోల్పోతున్న తరుణంలో కేరళ వంటి రాష్ట్రాల్లో భాజపా పుంజుకుంటుందని సీనియర్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఉన్న అవకాశాలను కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు.
దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలోనే బలంగా ఉంది భాజపా. మిగతా రాష్ట్రాల్లో ఉనికి అంతంతమాత్రంగానే ఉంది.
ఇదీ చూడండి: రాహుల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి: షా