2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించింది భాజపా. 80సీట్లలో మిత్రపక్షంతో కలిసి 73 స్థానాలు దక్కించుకుంది. మిగిలిన స్థానాలు దక్కింది రెండు కుటుంబాలకే... ఒకటి గాంధీ-నెహ్రూ పరివారం, మరొకటి ములాయం వంశం. అప్పుడు విడివిడిగా పోటీచేశాయి ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ. సమాజ్‌వాదీ పార్టీ అతికష్టం మీద 5 సీట్లు సాధిస్తే... బహుజన సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ అసలు ఖాతా తెరవలేదు.
సీట్లు పరంగా... ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉంది భాజపా. కానీ... ఇక్కడ సమస్య సీట్లు కాదు, ఓట్లు. 2014లో భాజపాకు వచ్చిన ఓట్ల శాతం 42.63. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీకి విడివిడిగా వచ్చి ఓట్లశాతాలు కలిపితే 42.98. ఇప్పుడు కలిసి ఒకే అభ్యర్థిని నిలబెడుతున్నాయి. అంటే... దాదాపు సమాన ఆదరణ. పోటీ హోరాహోరీ.
నువ్వానేనా అన్నట్లు జరుగుతున్న ఎన్నికల్లో... ప్రతి ఓటు కీలకమే. ప్రతి సీటు అవసరమే. అందుకే... అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది భాజపా. చిన్నపార్టీలను దగ్గర చేసుకుంటోంది. వారి డిమాండ్లలో సాధ్యమైనన్నింటికి పచ్చజెండా ఊపుతోంది. మరికొన్నింటిపై సానుకూలంగా స్పందిస్తూ... వారి మద్దతు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అప్నాదళ్‌కు కుర్మీ వర్గం మద్దతు రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఎస్బీఎస్పీకి ఓబీసీ వర్గానికి చెందిన రాజ్భర్ల ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఈశాన్య ఉత్తర ప్రదేశ్‌లో వీరి ప్రాబల్యం ఎక్కువ. ఆ పార్టీలతో కలిసి ఎన్నికలకువెళ్తే లాభమన్నది భాజపా అంచనా.
లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్‌తో పొత్తు కుదిరినా... ఎస్బీఎస్పీ సీట్ల కేటాయింపుపై చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఎస్బీఎస్పీకి పుర్వాంచల్ ప్రాంతంలో బాగా పట్టుంది. ఆ ప్రాంతంలోని స్థానాలను కేటాయించాలనే ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ఆ ప్రాంతంలోనిదే. జనసత్తా దళ్(లోక్తాంత్రిక్) పార్టీతోనూ పొత్తు కోసం ప్రయత్నిస్తోంది భాజపా.
వరాల జల్లు...