కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసి సరిగ్గా ఏడాది. అయితే... ఇది ఆయనకు పెద్ద సంతోషాన్నిచ్చే విషయం కాదు. కారణం.. లోక్సభ ఎన్నికల్లో భాజపా అంచనాలకు మించి రాణించడం. సంకీర్ణ ప్రభుత్వం స్థిరత్వంపై ఉన్న అనుమానాలు ఇప్పుడు తీవ్రమై... రాష్ట్ర రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
ఎన్నో మలుపులు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితం తర్వాత తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్- జేడీఎస్ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు, కుమారస్వామి భావోద్వేగ ప్రసంగాలు, కూటమిని కూలదోసేందుకు ప్రత్యర్థి భాజపా ప్రయత్నాలు.. ఇలా ఎన్నో మలుపులకు నిలయంగా మారింది కన్నడ రాష్ట్రం. అదే లొసుగులతో సార్వత్రిక సమరం బరిలోకి దిగాయి. భాజపాను నిలువరించాలని గట్టి ప్రయత్నమే చేశాయి. ఫలితం మాత్రం శూన్యం.
ఊహించని విధంగా భాజపా 25 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. 2014 సార్వత్రికంలో 17 గెల్చుకున్న భాజపా ఇప్పుడు 8 సీట్లు మెరుగుపర్చుకుంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 2 స్థానాలకే పరిమితమైంది. 2014లో కాంగ్రెస్ 9 స్థానాలు నెగ్గడం గమనార్హం. కూటమిలో సఖ్యత ఎలా ఉందో ఈ ఫలితాలే చెబుతున్నాయి.