బిహార్ ఎన్నికల్లో భాజపాకు సహాయం చేయడానికే.. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రసాద్ యాదవ్‌తో ఏఐఎంఐఎం కలిసి పోటీ చేస్తోందన్న ఆరోపణలను ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ.. బిహార్‌లో గెలవడానికి అసలు కారణం ఆర్జేడీయేనని ఎదురుదాడి చేశారు.
"లౌకికవాదుల ఓట్లను చీలుస్తున్నానని నాపై ఆర్జేడీ ఆరోపణలు చేస్తోంది. మరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ ఖాతా కూడా తెరవలేదు. దీనికి కూడా నేనే కారణమా? బిహార్‌లోని మైనారిటీలు, లౌకికవాదుల ఓట్లు తమకే దక్కుతాయని ఆర్జేడీ-కాంగ్రెస్ తెగేసి చెబుతున్నాయి. వీరందరూ 2019లో ఎక్కడికి వెళ్లినట్టు? భాజపా వ్యతిరేక ఓట్లు వీరికి ఎందుకు దక్కలేదు? ఇన్ని జరిగినా.. బిహార్‌లోని ముస్లింల ఓట్లు తమకే దక్కుతాయని వీళ్లు ఎలా అనుకుంటున్నారో నాకు మాత్రం అర్థం కావడంలేదు."
--- అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ సహా మరికొన్ని చిన్న పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి గెలవగా.. పార్టీ చరిత్రలోనే ఆర్జేడీ తొలిసారిగా ఖాతా తెరవలేదు.