తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దసరా స్కెచ్'తో బంగాల్​ పీఠంపై భాజపా గురి

'పూజా కీ బాత్​'... నరేంద్ర మోదీ చేపడుతున్న సరికొత్త కార్యక్రమం. దసరా సందర్భంగా బంగాల్​లో దుర్గామాత పూజలు ప్రారంభించడం, అక్కడి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం ముఖ్య అజెండా. అయితే.. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయ కోణమే అతి కీలకమైందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకలా? దసరా వేడుకలకు, బంగాల్​ రాజకీయాలకు సంబంధమేంటి?

BJP West Bengal
దుర్గామాత పూజలే వేదికగా.. బంగాల్​లో భాజపా వ్యూహరచన !

By

Published : Oct 21, 2020, 1:27 PM IST

​బంగాల్​లో అధికారం చేపట్టాలన్నది భాజపా కల. అందుకు అనుగుణంగా.. వ్యూహాత్మక అడుగులు వేస్తూ దీదీ సర్కారును ముప్పుతిప్పలు పెడుతోంది. రాజకీయ లబ్ధికి అక్కరకొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరాదని భావిస్తోంది. అన్నివర్గాలను ఆకట్టుకుని వచ్చే ఏడాది ఎన్నికల్లో అద్భుతం సృష్టించాలని యోచిస్తోంది. ప్రస్తుతం అందుకు దుర్గామాత ఉత్సవాలను సరైన వేదికగా మల్చుకోవాలని చూస్తోంది కమలదళం.

  • బంగాల్​ రాష్ట్ర భాజపా ఆధ్వర్యంలో మండపాల ఏర్పాటు, దుర్గా పూజల నిర్వహణ చేపడుతున్నారు.
  • ప్రధాని మోదీ.. అక్టోబర్ 22న 'పూజా కీ బాత్'​ పేరుతో దుర్గామాత పూజలను మొదలుపెట్టనున్నారు.
  • గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బంగాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
  • మోదీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు బంగాల్​లోని 78 వేల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: బంగాల్​లో రాజుకున్న వేడి- దీదీ సర్కారుకు తిప్పలేనా ?

సరికొత్త ఒరవడి..

ఇలా బంగాల్​లో ప్రతిష్టాత్మకంగా భావించే దుర్గామాత పూజల్లో సరికొత్త ఒరవడికి తెరతీస్తోంది భాజపా. బంగాల్ చరిత్రలోనే ఒక పార్టీ.. దుర్గాపూజ నిర్వహించటం ఇదే మొదటిసారి. 2021 శాసనసభ ఎన్నికల్లో హిందూ ఓటర్లను ఆకట్టుకోవటమే లక్ష్యంగా భాజపా అడుగులు వేస్తోందంటున్నారు విశ్లేషకులు.

బంగాల్​లో దసరా సందర్భంగా నిర్వహించే దుర్గా పూజకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఏడాది వేడుకలు అక్టోబర్​ 22న మొదలై.. అక్టోబర్ 26తో ముగుస్తాయి. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని రాజకీయ పక్షాలు విశేషంగా ప్రయత్నిస్తున్నాయి.

ఓవైపు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భాజపాపై దుమ్మెత్తిపోస్తున్నారు. 'దేశానికి పట్టిన అతిపెద్ద మహమ్మారి' అంటూ విరుచుకుపడుతున్నారు. అంతే దూకుడుగా వ్యవహరిస్తున్న భాజపా.. దీదీ ప్రభుత్వానికి అనేక సమస్యలు సృష్టిస్తూ, సవాల్ విసురుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మమత ఇలాఖాలో.. కాషాయ దళం దుర్గాపూజ నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: 'భాజపా ఓ దుష్ట శక్తి- కరోనా కన్నా పెద్ద మహమ్మారి'

భాజపాలో జోష్

ప్రధాని మోదీ 'పూజా కీ బాత్​'

ప్రధాని మోదీ సైతం ఈ పూజలో వర్చువల్​గా పాల్గొంటుండటం.. బంగాల్​ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం​ నింపుతోంది. ఇప్పటికే ఈ పూజతో పాటు ఎన్నికల్లోనూ విజయవంతం అయ్యేలా పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేశారు కమలనాథులు. కేంద్ర మంత్రి అమిత్​ షా.. మమతా బెనర్జీని ఓడించేందుకు కొన్నాళ్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో అమిత్​ షా ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.

కొవిడ్​ సంక్షోభం నేపథ్యంలో.. భాజపా పండుగ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనలో ఉంది. పూజా మండపాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. శ్యామ ప్రసాద్​ ముఖర్జీ జీవిత విశేషాలను మండపాల వద్ద పుస్తకాల రూపంలో అందుబాటులోకి తీసుకొస్తోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాలూ నిర్వహిస్తోంది.

టీఎంసీ ప్రణాళికలు

ఆన్​లైన్ ద్వారా పూజలు

అధికార టీఎంసీ సైతం.. దుర్గాపూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే వేడుకలు నిర్వహించనుంది. ఇలా పూజ వర్చువల్​గా ప్రారంభించటం ఇదే మొదటిసారి.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పూజలు మొదలుపెట్టారు. జిల్లాల్లో ఆన్​లైన్ ద్వారా పొల్గొన్నా... కోల్​కతాలోని కొన్ని మండపాల్లో ప్రత్యక్ష పూజలు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: వయా వర్చువల్​: బంగాల్​లో దుర్గా పూజోత్సవాలు ప్రారంభం

బెంగాలీలు ప్రత్యేకంగా భావించే దుర్గామాత పూజలను భాజపా రాజకీయాలకు వాడుకోవటం తమకే కలిసి వస్తుందని అంటున్నారు టీఎంసీ నేతలు.

వ్యూహాత్మకంగానే నిర్ణయం

గతంలో చాలా మంది రాజకీయ నేతలు.. పూజా కమిటీల్లో భాగంగా ఉండేవారు. అయితే, ఇప్పటివరకు ఒక పార్టీ ఆధ్వర్యంలో మండపం ఏర్పాటు, పూజల నిర్వహణ ఎప్పుడూ జరగలేదు. భాజపా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భాజపా బెంగాలీల వ్యతిరేక పార్టీ కాదని నిరూపించటమే లక్ష్యంగా కమల దళం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. భాజపాను బెంగాలీయేతర పార్టీగా చిత్రీకరిస్తున్నారు. ఆ విమర్శలకు చెక్​ పెట్టడమే కమలదళం లక్ష్యంగా కనిపిస్తోంది.

ఎన్నో ఏళ్ల కృషి తర్వాత.. భాజపా ఇప్పుడిప్పుడే బంగాల్​లో బలపడుతోంది. తృణమూల్​ కాంగ్రెస్​కు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ 42 స్థానాలకుగానూ 18 సీట్లు దక్కించుకుంది. రెండేళ్ల నుంచి రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ అధికారం చేపట్టని కాషాయ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో దీదీ 10ఏళ్ల పాలనకు తెరదించాలని చూస్తోంది.

ఇదీ చూడండి: బంగాల్​పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్​

ఇదీ చూడండి:బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!

ఇదీ చూడండి: కరోనా కయ్యం: అమిత్​ భాయ్​కు దీదీ గ్యాంగ్​ సవాల్​

ABOUT THE AUTHOR

...view details