మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ తరఫున ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన కమల్‌నాథ్.. భాజపా మహిళా అభ్యర్థి ఇమార్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే సమయానికి ఇమార్తీ దేవి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అనంతరం భాజపా గూటికి చేరి తాజాగా ఉపఎన్నికల్లో పోటీచేస్తున్నారు. దేవి కాంగ్రెస్‌కు ద్రోహం చేశారని.. ఆమె వ్యవహారం తనకు ముందు తెలియదని పేర్కొన్నారు కమల్‌నాథ్. ఈ నేపథ్యంలోనే పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
'అది నా తప్పా?'
కమల్‌నాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఇమార్తీ దేవి. ఆయన్ను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్ చేశారు.
"ఓ పేద ఎస్సీ కుటుంబం నుంచి రావడం నేను చేసిన తప్పా? కమల్‌నాథ్ లాంటి వారిని కాంగ్రెస్‌లో ఉండనీయరాదని నేను సోనియాను కోరుతున్నా. నా మీదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఎస్సీ సంఘంలోని మహిళల పరిస్థితి ఏంటి? మహిళలు ముందడుగు ఎలా వేస్తారు?"
--- ఇమార్తీ దేవి, భాజపా నేత.
కమల్‌నాథ్‌ను ఇన్నేళ్లు సోదరుడిగా భావించానని... కానీ ఆయన తనను అగౌరపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు ఇమార్తీ దేవి. నిజానికి జ్యోతిరాదిత్య సింధియా వల్లే తాను కేబినెట్ మంత్రి పదవి చేపట్టానని.. కమల్‌నాథ్ తనను చిన్నచూపు చూసేవారని ఆరోపించారు. కమల్‌నాథ్ వంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలని భాజపాను కోరారు.
ఇదీ చూడండి:-ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు ఉద్యమించాలి: సోనియా