బంగాల్లో దారుణ ఘటన జరిగింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టిటాగఢ్లో ఓ స్థానిక భాజపా నేతను కాల్చి చంపారు దుండగులు. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు.
బీటీ రోడ్డు ప్రాంతంలో స్థానిక కౌన్సిలర్ మనీశ్ శుక్లాపై రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిపారు దుండగులు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. టిటాగఢ్ పోలీస్ స్టేషన్కు సమీపంలోనే హత్య జరగటం గమనార్హం.
సమాచారం మేరకు ఘటనా స్థలికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సీబీఐ దర్యాప్తునకు డిమాండ్.
కాల్పులకు పాల్పడింది అధికార తృణమూల్ కాంగ్రెస్ అని ఆరోపించింది భాజపా నాయకత్వం. సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. శుక్లా హత్యకు అధికార టీఎంసీనే బాధ్యత వహించాలని భాజపా ఎంపీ అర్జున్ సింగ్ డిమాండ్ చేశారు.
" ప్రత్యర్థులు లేకుండా చేసే రాజకీయాలను టీఎంసీ ప్రారంభించటం సిగ్గుచేటు. పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరిగిన క్రమంలో స్థానిక పోలీసులపై మాకు నమ్మకం లేదు. సీబీఐ దర్యాప్తు చేయాలి."
- కైలాస్ విజయ్వర్గియా, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి.