బంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా... బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అనుపమ్ హజ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కరోనా సోకితే... సీఎంను ఆలింగనం చేసుకుంటానని తెలిపారు.
దక్షిణ 24 పరాగనా జిల్లాలో భాజపా కార్యకర్తలతో అనుపమ్ ఇటీవలే ఓ భేటీ నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన నేతలు, కార్యకర్తలు పెద్దగా మాస్కులను ధరించలేదు. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు హజ్రా. అయితే వాటికి సమాధానమిస్తూ.. కరోనా కంటే పెద్ద శత్రువు మమతా బెనర్జీ అని ఎద్దేవా చేశారు.
"మా కార్యకర్తలు బంగాల్లో.. కొవిడ్-19 కంటే పెద్ద శత్రువుతో పోరాడుతున్నారు. వాళ్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తలపడుతున్నారు. కార్యకర్తలు కొవిడ్ బారిన పడలేదు. అందుకే భయపడడం లేదు. ఒకవేళ నాకే కొవిడ్ వస్తే నేను మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుంటా. మహమ్మారి సోకిన వ్యాధిగ్రస్తులను సీఎం సరిగా పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలను కిరోసిన్‌తో కాల్చేశారు. మృతి చెందిన కుక్కలు, పిల్లులను కూడా మేం అలా చూడలేదు," అని విమర్శలు గుప్పించారు అనుపమ్ హజ్రా.