ఎన్నికల్లో విజయం కోసం భాజపా చేస్తున్న మ్యాజిక్ ఇది! యూపీలో భాజపా నేత అజయ్ దివాకర్ బుధవారం ఒక మాయాజాలం ప్రదర్శించారు. ఎన్నికల ప్రచార సభలో బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ జెండాలను భాజపా జెండాగా మార్చి తమ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 11 శాసనసభ నియోజకవర్గాలకు ఈ నెల 21న ఉపఎన్నికలు జరగనున్నాయి.
రాంపుర్ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలోకి దిగిన భరత్ భూషణ్ కోసం మొరాదాబాద్ భాజపా కౌన్సిలర్ దివాకర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు మ్యాజిక్ ట్రిక్‌లు ప్రదర్శించారు. ఇందులో భాజపా, బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ జెండాలను ఒకే దగ్గర ముడేసి చివర్లో భాజపా జెండా మాత్రమే మిగిలేలా చేశారు. ఇంద్రజాలంలానే ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేసినా విజయ ఢంకా మోగించేది మాత్రం భాజపానే అని ప్రజలకు వివరించారు.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజం ఖాన్ పార్లమెంట్‌కు ఎన్నికైనందున రాంపుర్ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం అజంఖాన్ భార్య తంజీన్ ఫాతిమా బలమైన ప్రత్యర్థిగా ఉండడం వల్ల నియోజకవర్గాన్ని కీలకంగా పరిగణిస్తోంది భాజపా.
ఇదీ చూడండి:భర్త ఎదుటే భార్యా-పిల్లల సజీవ దహనం