తెలంగాణ

telangana

స్వతంత్రుల మద్దతు.. ముఖ్యమంత్రిగా ఖట్టర్​!

By

Published : Oct 25, 2019, 3:17 PM IST

హరియాణాలో భాజపా జెండా ఎగరడం దాదాపు ఖాయమైంది. కాషాయ పార్టీ బలం 48కి చేరడం వల్ల స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఖట్టర్​ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం గర్వర్నర్​ను కలిసే అవకాశముంది.

స్వతంత్రుల మద్దతు.. ముఖ్యమంత్రిగా ఖట్టర్​!

హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్ధమైంది. ఎన్నికల్లో సాధారణ మెజార్టీ సాధించడంలో విఫలమైనప్పటికీ స్వతంత్రుల మద్దతుతో కలిసి ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌.. మరోసారి అధికార పీఠాన్ని అధిష్టించనున్నారు. భాజపాకు మద్దతిస్తామని ఏడుగురు స్వతంత్రులతోపాటు హరియాణా లోక్‌హిత్‌ ఎమ్మెల్యే ప్రకటించిన నేపథ్యంలో.. రేపు ముఖ్యమంత్రిగా ఖట్టర్‌ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.

హరియాణాలో హంగ్ ఫలితం వచ్చిన వేళ.. అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా అధికారం దక్కించుకునేందుకు వేగంగా పావులు కదిపింది. 24 గంటల్లోపే అవసరమైన మద్దతు కూడగట్టింది. 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణాలో సాధారణ మెజార్టీకి 46 మంది ఎమ్మెల్యేలు అవసరంకాగా.. భాజపా 40 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ 31, జేజేపీ 10 చోట్ల విజయం సాధించాయి. ఏడుగురు స్వతంత్రులతోపాటు హరియాణా లోక్‌హిత్‌ పార్టీ ఎమ్మెల్యే భాజపాకు మద్దతు ప్రకటించడం వల్ల భాజపా బలం 48కి చేరింది. ఈ మేరకు పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి దిల్లీలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఖట్టర్‌.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అందుకు నడ్డాఆమోదం తెలిపినట్లు సమాచారం.

శనివారం భాజపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహించి.. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఖట్టర్‌ గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. తనకు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న ఖట్టర్.. త్వరలోనే అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details