పంజాబ్ యువజన కాంగ్రెస్ నేతలు ఇండియా గేట్ సమీపంలో ట్రాక్టర్ను దహనం చేయడంపై భాజపా మండిపడింది. ప్రచారం కోసం రాజధానిలో డ్రామాలు చేసి దేశం సిగ్గుపడేలా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రైతులను తప్పుదోవ పట్టించేందుకే పార్టీ ఇలాంటివి చేస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. ట్రాక్టర్ కాల్చివేతను తీవ్రంగా తప్పుబట్టారు.
"ట్రాక్టర్ను ట్రక్కులో తీసుకొచ్చి ఇండియా గేట్ వద్ద కాల్చేసి కాంగ్రెస్.. దేశాన్ని సిగ్గుపడేలా చేసింది. కాంగ్రెస్ చేసిన డ్రామాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రైతుల పేరిట రాజకీయాలు చేస్తున్నారు. ఆ విషయం ఇప్పుడు బయటపడింది. ప్రచారాల కోసమే కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది."
-ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
భాజపా తన మేనిఫెస్టోలోనే ఈ వాగ్దానం చేసిందని.. దాన్ని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు జావడేకర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ఈ విషయంపై ఒకప్పుడు సానుకూలంగానే మాట్లాడారని, ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం రైతులను మభ్యపెడుతోందని విమర్శించారు. అందుకే ఆ పార్టీ క్రమంగా ప్రజలతో సంబంధాలు కోల్పోతోందని చురకలంటించారు.
ఇదీ చదవండి-వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతుల ఆందోళనలు
స్వతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ.. రైతు వ్యతిరేక నిరసనలు చేస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన కుట్రలు ఇప్పుడు బయటపడ్డాయన్నారు.