గోవా నూతన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ భాజపా తనకు అతిపెద్ద బాధ్యతను అప్పగించిందని గోవా నూతన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్లా పని చేయలేకపోయిప్పటికీ... గోవా అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
" పార్టీ నాకు పెద్ద బాధ్యత అప్పగించింది. ఆ విధంగానే మంచిగా పనిచేయాలనుకుంటున్నా. ఈ రోజు ఒకటి చెప్పాలనుకుంటున్నా... మనోహర్ పారికరే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. స్పీకర్‌ని చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పనులు ముందుగా పూర్తి చేయాలనుకుంటున్నాం. మనోహర్ పారికర్లా పని చేయకపోవచ్చు. కానీ రాష్ట్రాభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తా" - ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి.
పారికర్‌కు విధేయుడిగా
ఆయుర్వేద వైద్యుడి నుంచి గోవా ముఖ్యమంత్రి వరకు ఎదిగారు ప్రమోద్ సావంత్. ఆర్ఎస్ఎస్ నాయకుడైన ప్రమోద్... దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌కు మద్దతుదారుడిగా, విధేయుడిగా మంచి గుర్తింపు పొందారు. భాజపాలో యువజన నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పారికర్‌తో ఎన్నో సందర్భాల్లో కలిసి పనిచేసిన అనుభవం ప్రమోద్ సొంతం.
ఉత్తర గోవాలోని సంఖలిమ్ నియోజకవర్గం నుంచి 2012, 2017లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017లో అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో గోవా మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గానూ పనిచేశారు.