జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఏ రద్దు, రాష్ట్ర విభజనకు ప్రభుత్వ చర్యలపై గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ప్రసంగాన్ని భాజపా వర్గాలు ప్రశంసిస్తే... విపక్ష కాంగ్రెస్ విమర్శలు చేసింది. కశ్మీర్ ప్రజలకు భరోసా, నమ్మకం ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తింది.
కశ్మీరీల సంక్షేమమే లక్ష్యం: షా
జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రజల అభివృద్ధి కోసం తన సంకల్పం, నిబద్ధతను ప్రధాని తెలియచెప్పారని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం, సంక్షేమం ప్రధాని మొదటి ప్రాధాన్యాంశాలని పేర్కొన్నారు. గడిచిన 70 ఏళ్లుగా కశ్మీరీలు అధికరణ 370తో అభివృద్ధికి దూరమయ్యారని తెలిపారు షా. దానికి ప్రధాని ముగింపు పలికారన్నారు.
చారిత్రకం: రవిశంకర్
ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ప్రధాని ప్రసంగం చారిత్రకమని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు రానున్న రోజుల్లో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందుతాయని ధీమా వ్యక్తం చేస్తూ... 'కశ్మీర్ విత్ మోదీ' హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.