తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర రాజకీయాల్లో ఫోన్​ ట్యాపింగ్​ కలకలం - మహారాష్ట్ర వార్తలు

మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వ హయాంలో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్​ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన మాజీ సీఎం ఫడణవీస్​.. దర్యాప్తునకు సిద్ధమని స్పష్టం చేశారు.

MH-TAPPING
MH-TAPPING

By

Published : Jan 24, 2020, 7:15 PM IST

Updated : Feb 18, 2020, 6:47 AM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, తదనంతరం మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో అప్పటి భాజపా ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై తమకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు.

లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లను అప్పటి భాజపా ప్రభుత్వం ట్యాప్​ చేసిందని అనిల్​ ఆరోపించారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఇజ్రాయెల్​ నుంచి ఇంటర్సెప్ట్​ సాంకేతికతను తెప్పించి విచారణ జరపనున్నట్లు సమాచారం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అనిల్​.

అలాగే, గతంలో మంత్రిగా పనిచేసిన భాజపా సీనియర్‌ నేత ఒకరు ఫోన్‌ ట్యాపింగ్‌పై తనను హెచ్చరించారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్​ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

"మీ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురవుతుందని గతంలో భాజపా మంత్రిగా పనిచేసిన వ్యక్తే నాతో అన్నారు. అందుకు నేను స్పందిస్తూ.. నా సంభాషణల్ని ఆలకించేందుకు ఇష్టపడేవారు వాటిని స్వేచ్ఛగా వినొచ్చు. నేను బాలాసాహెబ్‌ శిష్యుడిని. నేనేదీ రహస్యంగా చేయను."

-సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ

'శివసేన భాగమే కదా..'

ఈ వ్యవహారంపై స్పందించిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​.. తమ ప్రభుత్వం చేసినట్లు వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఏ సంస్థతోనైనా స్వేచ్ఛగా దర్యాప్తు చేయించుకోవచ్చని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి సవాల్​ విసిరారు.

"మహారాష్ట్రలో విపక్షాల ఫోన్​ ట్యాప్​ చేయటం సంప్రదాయం కాదు. మా ప్రభుత్వం అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం స్వేచ్ఛగా విచారణ చేపట్టవచ్చు. మా ప్రభుత్వ పాలనలో శివసేనకు చెందినవారూ హోంశాఖలో ఉన్నారు."

- దేవేంద్ర ఫడణవీస్​, మహారాష్ట్ర మాజీ సీఎం

ఇదీ చూడండి: 'ప్రభుత్వ పరిపాలనకు రాజ్యాంగమే పవిత్రగ్రంథం'

Last Updated : Feb 18, 2020, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details